సాక్షి, హైదరాబాద్: సొంత రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్.. పక్క రాష్ట్రానికి చెందిన వారికి కొలువులు ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పరా యి రాష్ట్రంలో పరపతిని పెంచుకునేందుకే కిరాయి మనుషులను తెచ్చి పెట్టుకుంటున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు.
ఐటీ ఉద్యోగం వది లేసిన మహారాష్ట్రకు చెందిన శరద్ మడ్కర్ అనే వ్యక్తి బీఆర్‌ఎస్‌లో చేరారని పత్రికల్లో ప్రచారం చేసుకున్నారన్నారు. ఏప్రిల్ 10న బీఆర్‌ఎస్‌లో చేరిన అతడిని మే 2న సీఎం తన ప్రైవేటు కార్యదర్శిగా నియమించారన్నారు. ఎవరి సొమ్మని అతనికి ఏడాదికి రూ.18 లక్షల జీతం ఇస్తున్నా రని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన జీవోను రహస్యంగా ఉంచారని, తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ భ్రమలు తొలగిపోతాయి: తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం, చివరకు టీఎస్‌పీఎస్సీ అమ్ముకుందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో 2 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కేసీఆర్ సచివాలయాన్ని ప్రైవేట్ ఎస్టేట్ అనుకుంటున్నారని, త్వరలోనే ఆయన భ్రమలు తొలగిపోతాయని వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించాలని కేసీఆర్ అనుకుంటే.. కర్ణాటకలో మీడియా సమావేశం పెట్టి బీజేపీని ఓడించాల్సిందిగా పిలుపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు ఎంఐఎంకు లొంగిపోయారని విమర్శించారు.
ప్రియాంక సభలో హైదరాబాద్ డిక్లరేషన్!
గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరిట రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ విడుదల చేశారని.. అదే స్ఫూర్తితో సరూర్‌నగర్ సభలో హైదరాబాద్ డిక్లరేషన్‌ను విడుదల చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. దానిని ప్రియాంకాగాంధీ విడుదల చేస్తారని.. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటామో అందులో ప్రకటిస్తామని చెప్పారు.
టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో మార్చి ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతామో సభలో వివరిస్తామని తెలిపారు. ఈ నెల 8న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ‘యువ సంఘర్షణ సభ’నిర్వహించనుంది. ఈ మేరకు శుక్రవారం రేవంత్‌రెడ్డితోపాటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ‘యువ సంఘర్షణ సభ’లోగోను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ప్రభు త్వ తీరును ఎండగట్టేందుకే ఈ సభ నిర్వహిస్తున్నామని రేవంత్ చెప్పారు. విద్యార్థి, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ అండగా ఉందన్న భరోసా కల్పించేందుకే ప్రియాంక వస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ విముక్త తెలంగాణ కావాలి
‘‘ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలను ఎలా నింపబోతున్నాం. ప్రైవేటు సంస్థల్లో 75శాతం స్థానికులకు రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని ఏ విధంగా తీసుకురాబోతున్నామో హైదరాబాద్ డిక్లరేషన్‌లో వివరిస్తాం. పేపర్ లీకేజీలను నియంత్రించేందుకు యూ పీఎస్సీ తరహాలో ఉద్యోగ నియామకాలు ఎలా చేపట్టబోతున్నామో వివరిస్తాం’’అని రేవంత్ వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడ గొడితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. యువత కేసీఆర్ విముక్త తెలంగా ణ తీసుకొచ్చేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అండగా ఉంటుంది..: ఠాక్రే
విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని మాణిక్ రావ్ ఠాక్రే చెప్పారు. కర్ణాటకలో ఒడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద బీజేపీ నిరసనలు చేపడుతోందని విమర్శించారు. ఇలాంటివి తెలంగాణ రాజకీయ సంçస్కృతికి మంచివి కావని.. ఇలాంటి చర్యలతో సంజయ్, కిషన్‌రెడ్డి గౌరవం తగ్గుతుందన్నారు.
సభ కోసం కోఆర్డినేటర్లు..
సరూర్‌నగర్‌లో నిర్వహించే ప్రియాంకా గాంధీ సభను విజయవంతం చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఇందుకోసం శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించింది. సభ ఏర్పాట్లపై రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావ్ ఠాక్రే, రోహిత్ చౌదరి, రాష్ట్ర ముఖ్య నేతలు సమీక్షించారు. సభను విజయవంతం చేసేందుకు ఏడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించారు. అనంతరం అనుబంధ సంఘాల చైర్మన్లతోనూ సమావేశం నిర్వహించారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావ్ అధ్యక్షతన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. సభను విజయవంతం చేసేందుకు అన్ని అనుబంధ సంఘాలు, పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఠాక్రే, రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment