సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కులగణన నివేదికను కాల్చివేయడంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో క్రమశిక్షణా కమిటీతో గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ చర్చించనున్నారు.
పీసీసీ చీఫ్‌తో చర్చించిన తర్వాత తీన్మార్‌మల్లన్నపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మల్లన్నపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.
బీసీ కులగణన నివేదికతో పాటు సొంత పార్టీ నేతలపై వరంగల్ బీసీ గర్జనలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగాను మల్లన్నకు షోకాజ్ నోటీసులిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కాగా, మల్లన్న గత కొంతకాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై తన యూట్యూబ్ ఛానల్‌లో చర్చలు కూడా పెడుతున్నారు. సొంత పార్టీ లీడర్లపైనా యూట్యూబ్ ఛానల్ వేదికగా విమర్శలు చేస్తున్నట్లు టీపీసీసీ దృష్టికి వచ్చింది. వీటన్నిటిపైనా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి.
Comments
Please login to add a commentAdd a comment