రుణమాఫీ చేస్తున్నాం.. హరీష్‌ రాజీనామాకు సిద్ధమా?: సీఎం రేవంత్‌ | TPCC Key Meeting At Praja Bhavan Live Updates | Sakshi
Sakshi News home page

రైతు రుణమాఫీ గురించి 20 ఏళ్లు చెప్పుకోవాలి: సీఎం రేవంత్‌

Published Wed, Jul 17 2024 2:28 PM | Last Updated on Wed, Jul 17 2024 4:10 PM

TPCC Key Meeting At Praja Bhavan Live Updates

Updates..

టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి కామెంట్స్‌..
👉ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పిన దాని కంటే ముందే చేస్తున్నాం. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలామంది మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమని నిరూపించాం. 

👉60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు. సోనియా గాంధీ కుటుంబం గౌరవం కాపాడాలి. దేశానికి ఆదర్శ పాలన మనం ఎందుకు చేయకూడదు.

👉వ్యవసాయం దండుగ కాదు పండుగ. రైతులకు రుణమాఫీ చేయడం నా జీవితంలో మర్చిపోలేనిది. రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో‌ ముడిపడి ఉంది. రేపు సాయంత్రం రైతుల ఖాతాలో డబ్బు పడుతుంది. ఆగస్టు 15వ తేదీ లోపల మరో లక్ష రూపాయలు వేస్తాం అని చెప్పుకొచ్చారు. 

👉రుణమాఫీపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలి. పార్లమెంటు సభ్యులు రుణమాఫీపై నేషనల్ మీడియాలో చెప్పాలి. భారతదేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని తెలంగాణ ప్రభుత్వం చేసింది. రుణమాఫీ మోదీ హామీ కాదు. ఇది రాహుల్ గాంధీ హామీ. దివంగత మహానేత వైఎస్సార్‌ ఉచిత కరెంట్‌, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అలాగే, రుణమాఫీ గురించి కూడా 20 ఏళ్లపాటు చెప్పుకోవాలి.

👉విజయ్‌ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లు, వేల కోట్ల అప్పులు ఉన్నవాళ్లకి కూడా ఏం కాదు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడానికే రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం. దీనిపై గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో ప్రచారం చేయాలి. ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్ళాం. ఇపుడు రుణమాఫీ చేశామని గ్రామాల్లో చెప్పండి. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్‌.. 
👉‘ఆగస్టు దాటకుండానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ అమలుకు నిద్రలేని రాత్రులు గడిపాం. అర్హులైన అందరికీ రైతు రుణమాఫీ చేస్తాం. రూ.7లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టినప్పటికీ రూ.2లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాం. రేషన్‌కార్డులు లేని ఆరు లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నాం. అయితే, అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదు. 
 

👉 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. 

👉 కాగా, రేపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ‍ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొం‍దిస్తున్నారు. 

👉 కాసేపట్లో ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగనుంది.
👉పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. 
👉ఇక, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది.

👉ప్రజాభవన్‌ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్‌ బేరర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ గాంధీభవన్‌ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు.

👉మరోవైపు ఈరోజు భేటీలో ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ నేతల మధ్య సమన్వయ​ంపై చర్చ జరుగనుంది. అలాగే, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌పై పార్టీ నేతలకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

👉ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్‌ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

👉అలాగే, రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబురాలకు సంబంధించిన కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

👉ఇటీవలి రాజకీయ పరిణామాలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్‌ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్‌ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement