సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా నేపథ్యంలో త్వరలో జరిగే ఉçప ఎన్నికకు టీఆర్‌ఎస్ సన్నాహాలు ప్రారంభించింది. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసే వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ జరిగిన నాటి నుంచే హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం చేజారకుండా టీఆర్‌ఎస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
హుజూరాబాద్‌లో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్, జిల్లా స్థాయిలో మంత్రి కమలాకర్ సారథ్యంలో ప్రత్యేక కమిటీని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలు, మండలాలవారీగా నియమితులైన ఇన్‌చార్జీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రియాశీల కార్యకర్తల వరుస భేటీలు జరుపుతున్నారు. ఇతర పార్టీల్లో క్రియాశీలకంగా ఉన్న నాయకులను కూడా పార్టీ గూటికి చేర్చే పనిలో ఉన్నారు.
బీజేపీకి అడ్డుకట్ట వేయాలని...
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో దూకుడు ప్రదర్శించిన బీజేపీకి శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక, మినీ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అడ్డుకట్ట వేయగలిగింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో హుజూరాబాద్‌లోనూ ఆ పార్టీ ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని టీఆర్‌ఎస్ కృతనిశ్చయంతో ఉంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలకు నియోజకవర్గం కొట్టిన పిండి కావడంతో ఇప్పట్నుంచే సర్వశక్తులు ఒడ్డాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా తదితరాల నేపథ్యంలో ఆయనపై సానుభూతి పనిచేస్తుందా?, పార్టీ యంత్రాంగం, సామాన్య ప్రజానీకంలో ఎలాంటి అభిప్రాయం ఉంది? వంటి అంశాలను వివిధ రూపాల్లో టీఆర్‌ఎస్ మదింపు చేస్తోంది. వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని క్రోడీకరించి అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చుకోవాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం భావిస్తోంది.
పార్టీ అభ్యర్థిపై ఇప్పుడే చర్చ వద్దు...
సుమారు రెండు దశాబ్దాలపాటు నియోజకవర్గంలో ఈటల నేతృత్వంలోనే టీఆర్‌ఎస్ యంత్రాంగం పనిచేయగా ప్రస్తుతం ఆయన పార్టీని వీడటంతో ప్రత్యామ్నాయం ఎవరనే చర్చ జరుగుతోంది. అయితే నాగార్జునసాగర్ తరహాలో పార్టీ అభ్యర్థి ఎవరనే చర్చ జోలికి వెళ్లకుండా కేవలం పార్టీ సమన్వయంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. అభ్యర్థి ఎవరనే అంశం తెరపైకి వస్తే పార్టీ యం త్రాంగం దృష్టి మరలి నష్టం జరుగుతుందనే అభిప్రాయం పార్టీలో కనిపిస్తోంది.
అభ్యర్థి ఎవరనే చర్చ జోలికి వెళ్లకుండా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టాలని ఇన్‌చార్జీలను ఆదేశించింది. అభ్యర్థి ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలనే భావన కార్యకర్తల్లో నింపే దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది. దుబ్బాక తరహాలో హుజూరాబాద్‌లో బీజేపీ విజయం సాధిస్తే రాబోయే రోజుల్లో పార్టీ నుంచి వలసలు పెరిగే అవకాశముంటుందనే అంచనాతో ఆ పార్టీకి ఏ ఒక్క అవకాశాన్ని ఇవ్వకూడదన్న పట్టుదల టీఆర్‌ఎస్ శిబిరంలో కనిపిస్తోంది. స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని మోహరించాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment