లింగోజిగూడెంలో నల్ల దుస్తులతో ప్రచారం చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి నెట్‌వర్క్: ‘ఎమ్మెల్యేలకు ఎర’వ్యవహారంలో టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల పరస్పర ఆరోపణలు, విమర్శలు, నిరసనలతో పరిస్థితి వేడెక్కింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఇరుపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. తమ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ కుట్ర చేసిందంటూ టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. ప్రతిగా టీఆర్‌ఎస్ కావాలనే బురద జల్లుతోందని, మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో రాజకీయం చేస్తోందని బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పలుచోట్ల పోటాపోటీ నినాదాలు, రాస్తారోకోలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
►యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రతిగా టీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో మునుగోడుకు వెళ్తున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి ఎంపీ కాన్వాయ్‌ను పంపించారు.
►మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బీజేపీ తీరును నిరసిస్తూ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో నల్ల దుస్తులు ధరించి ఎన్నికల ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని, బీజేపీ కుప్పిగంతులు సాగవని వ్యాఖ్యానించారు.
►సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ నిరసన చేపట్టింది. ప్రధాని మోదీ, అమిత్‌షాల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించింది. ∙బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు వనపర్తి జిల్లా కొత్తకోట చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వారు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
►కరీంనగర్ జిల్లా మానకొండూరులో టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా ఆందోళనలకు దిగాయి. వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలతో నిరసన తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment