సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో సంస్థాగత కమిటీల ఏర్పాటు కొన్ని నియోజక వర్గాల్లో విభేదాలకు దారితీస్తోంది. బహుళ నాయ కత్వం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమిటీల్లో చోటు కోసం కేడర్ వర్గాలవారీగా విడిపోవడంతో కమిటీల ఏర్పాటుపై అక్కడక్కడా పీటముడి పడింది. ఈ నెల 2న మొదలైన గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఈ నెల 12తో ముగియాల్సి ఉండగా 80 శాతం మేర కమిటీలు ఏర్పాటయ్యాయి. మిగతా చోట్ల కూడా ఈ నెల 15లోగా క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసి కమిటీల వివరాలు రాష్ట్ర కార్యాలయంలో అందజేయాలని పార్టీ తాజాగా ఆదేశించింది. అయితే పలు నియోజక వర్గాల్లో నేతల నడుమ విభేదాలతో గడువులోగా కమిటీల ఏర్పాటు 100 శాతానికి చేరుకునే అవ కాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
టీఆర్‌ఎస్ లోకి వలస వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటు ప్రక్రియ సాఫీగా జరగడం లేదనే ఫిర్యాదులు పార్టీ అధిష్టానానికి అందుతున్నాయి. వారు ఏకపక్షంగా తమ అనుచరులతో కమిటీలను ఏర్పాటు చేస్తూ మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి చోట పాత నాయ కులంతా స్తబ్దుగా ఉన్నట్లు సమాచారం. తాం డూరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, ఆలేరు, భూపాలపల్లి, మేడ్చల్, పాలేరు, కొల్లాపూర్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మె ల్యేలు, ఇతర ముఖ్య నేతల నడుమ విభేదాలు తీవ్రంగా ఉండటం కమిటీల ఏర్పాటుపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌లో కమిటీల ఏర్పాటు మందకొడిగా సాగడంపైనా అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. 450 బస్తీ కమిటీలు ఏర్పాటు చేయా ల్సిన చోట కనీసం వందచోట్ల కూడా కమిటీల ఏర్పాటు కాలేదని పార్టీవర్గాల సమాచారం.
కేటీఆర్ వద్దకు తాండూరు వివాదం...
తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి. మహేందర్‌రెడ్డి పోటాపోటీగా అనుచరులతో వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశారు. దీనిపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేటీఆర్ సోమవారం ఇద్దరు నేతలతో సంయుక్తంగా భేటీ అయ్యారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డికి ఇద్దరు నేతలను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. వేర్వేరుగా ఏర్పాటు చేసిన కమిటీలను రద్దు చేసి గ్రామం, వార్డు స్థాయిలో ఒకే కమిటీ చొప్పున ఏర్పాటు చేయాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. అయితే చాలా నియోజకవర్గాల్లో సంస్థాగత కమిటీల్లో చోటు కోసం పార్టీ కేడర్ పట్టుబడుతుండటం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఇక్కట్లు కలిగిస్తోంది. దీంతో చాలా చోట్ల ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా పాత కమిటీలనే కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. కమిటీల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 51 శాతం మంది ఉండేలా చూడాలని పార్టీ అదేశించడంతో కూర్పు కోసం ఎమ్మెల్యేలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20లోగా మండల, పట్టణ, మున్సిపల్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉండగా కమిటీల్లో చోటు కోసం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలపై ముఖ్య కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
20 తర్వాత ఔత్సాహిక ‘అధ్యక్షులు’
ఈ నెల 20 తర్వాత కొత్త జిల్లాలవారీగా పార్టీ జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మండల, మున్సిపల్ కమిటీల ఏర్పాటును ఆలోగా పూర్తి చేసి పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి వివరాలు సేకరించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ముగ్గురు లేదా నలుగురు ఆశావహుల పేర్లను ఈ నెల 21న అందజేయాలని కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులను సోమవారం ఆదేశించారు. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారి పేర్లను పంపితే రాష్ట్ర స్థాయిలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధినేత జిల్లా అధ్యక్షులను నియ మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment