సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించబోతుందా? అనే ఉత్కంఠ నెలకొన్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బయటి నుంచి రాలేదని.. సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నట్లు పునరుద్ఘాటించారాయన. అలాగే సీఎం ఎంపిక విషయంలో గందరగోళం ఏదీ లేదని.. పార్టీ అధిష్టానం సరైన పద్ధతే పాటిస్తోందని చెప్పారాయన.
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలున్నాయనే ఢిల్లీకి వచ్చాను. మొదటి నుంచి నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా. పార్టీని ఎప్పుడూ వీడలేదు. అలాగని నేనేం బయటి నుంచి రాలేదు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కాంగ్రెస్ పెద్దలను కలిశాను. చెప్పాల్సింది చెప్పాను’’ అని అన్నారాయన.
.. ‘‘నేనూ, నా భార్య ఎప్పుడూ క్షేత్రస్థాయిలోనే పని చేస్తుంటాం. నాకిచ్చిన పనిని సమర్థవంతంగా చేస్తుంటా. ప్రతీ ఎన్నికలకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. నేను పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌పై ఇంత వ్యతిరేకత లేదు. కానీ, ఇప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. పీసీసీ ప్రెసిడెంట్‌ను కాదు కాబట్టి ఆ స్థాయిలో ప్రచారం చేయలేకపోయాను. ఫలితాల్లో 70 స్థానాలు వస్తాయని అనుకున్నాం. కానీ, 64 దగ్గరే ఆగిపోవడం నిరాశపర్చింది. హైదరాబాద్‌లో వాష్ అవుట్ అయ్యాం. ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించలేదు కూడా’’ అని ఉత్తమ్ అన్నారు.
అలాగే.. సీఎం పదవిని ముగ్గురు.. నలుగురు ఆశించడంలో తప్పేంటి? ఎంపిక విషయంలో తాత్సారం ఏమీ జరగలేదని.. ఫలితాలు వచ్చి 48 గంటలు మాత్రమే గడిచాయని.. సీఎం ఎంపిక విషయంలో ఎలాంటి గందరగోళం లేదని అన్నారాయన. సీఎం ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్ సరైన పద్ధతి పాటిస్తోందని, కానీ, అభ్యర్థిని ఎంపిక చేసే ముందు విధేయత, ట్రాక్ రికార్డు, సొంత ఇమేజ్ వంటి అంశాలన్నీ పరిశీలించాలని కోరారాయన.
Comments
Please login to add a commentAdd a comment