బీజేపీ ఉలిక్కిపడుతోంది: మంత్రి జగదీశ్‌రెడ్డి  | TS: Minister Jagadish Reddy Comments On BJP Party | Sakshi
Sakshi News home page

బీజేపీ ఉలిక్కిపడుతోంది: మంత్రి జగదీశ్‌రెడ్డి 

Published Mon, Jul 4 2022 2:43 AM | Last Updated on Mon, Jul 4 2022 2:43 AM

TS: Minister Jagadish Reddy Comments On BJP Party - Sakshi

సంస్థాన్‌ నారాయణపురం: దేశ ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ కొత్త ఎజెండా రూపొందించారని, అదిచూసి బీజేపీ ఉలిక్కి పడుతోందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం చిమిర్యాలలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఎజెండాతో భయపడిన బీజేపీ నాయకత్వం మొత్తం హైదారాబాద్‌కు వచ్చిందన్నారు.

బీజేపీ సమావేశాలు హైదారాబాద్‌లో పెట్టుకోవడంతో పాటు తెలంగాణలోని ప్రతి నియోజవర్గానికి కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులను పంపించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. వారికిది విజ్ఞాన యాత్ర కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా పల్లెల్లో ప్రకృతి వనాలు, చెత్త డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు ఇతర అభివృద్ధి పనులు స్వాగతం పలుకుతాయన్నారు.

ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తుపెట్టుకుని వెళ్లి వారివారి రాష్ట్రాల్లో అమలు చేస్తే అక్కడి ప్రజలకు ఉపయోగపడుతుందని సూచించారు. బీజేపీకి అధికారం అప్పగిస్తే ఎనిమిదేళ్లలో ఒక నిమిషం కూడా అభివృద్ధి గురించి ఆలోచించలేదని విమర్శించారు. దేశంలో అభివృద్ధి తీరోగమనంలోకి వెళ్తోందని, సీఎం కేసీఆర్‌ పాలన చూసైనా బీజేపీ నేతల్లో మార్పురావాలని కోరుకుంటున్నామని తెలిపారు. మార్పు రాకపోతే ప్రజలే వారిని మారుస్తారని తెలిపారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement