సెప్టెంబర్ 17న జరిపే ‘ప్రజాపాలన’దినోత్సవానికి హాజరు కాను
సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రను తుడిచివేసే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వామిని కాలేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం ప్రజల దృష్టిని మరల్చడమేనని అన్నారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ‘సెప్టెంబర్ 17న ప్రతిపాదిత ప్రజాపాలనా దినోత్సవం కోసం ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు. అయితే ఇంతటి పవిత్రమైన, స్ఫూర్తిదాయకమైన రోజును, వేలాదిమంది త్యాగాల ఫలితమైన విమోచన దినోత్సవానికి పేరుమార్చి.. చరిత్రలో ఏమీ జరగలేదన్నట్టుగా, పరిపాలన నియంత రాజు నుంచి ప్రజాస్వామ్యానికి మారడం మాత్రమే జరిగిందన్నట్టుగా చెప్పడం వాస్తవ చరిత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడమేనని అర్థమవుతోంది.
దీంతోపాటుగా బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహించినట్టవుతోంది. రజాకార్ల హింసకు వేలమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి ఈ గడ్డపై పుట్టిన బిడ్డగా మీకు తెలుసు. వీరుల వీరోచిత పోరాటం, నిస్వార్థ త్యాగం, హృదయ విదారక పరిస్థితులను ఎదుర్కొనడం, బలిదానం కావడం ఇదే మన తెలంగాణ చరిత్ర. అందుకే సెప్టెంబర్ 17 నాడు.. ఆ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రస్తుత తరానికి మన పెద్దల ధైర్య, సాహసాలను తెలియజేసి జాతీయభావన కల్పించాల్సిన అవసరం ఉంది. విమోచన చరిత్రను వారికి అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది.
అయితే గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ వీరుల త్యాగాలను స్మరించుకునేలా, వారికి ఘనంగా నివాళులు అర్పించేలా.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఘనంగా, అధికారికంగా నిర్వహిస్తోంది. అందుకే వాస్తవ, ఘనమైన తెలంగాణ చరిత్రను ప్రజల çస్మృతిపథం నుంచి తుడిచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో నేను భాగస్వామిని కాలేను.
సెప్టెంబర్ 17వ తేదీ.. అత్యంత ప్రాధాన్యం కలిగిన రోజుగా మీరు గుర్తించి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోవడం సంతోషకరం. సమీప భవిష్యత్‌లో వాస్తవాలను అర్థం చేసుకొని ఈ చరిత్రాత్మకమైన రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా గుర్తిస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నాను’ అని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment