చట్టసభలోకి బాలీవుడ్‌ బ్యూటీ.! | Urmila Matondkar May Elect To Maharashtra Lawmaker | Sakshi
Sakshi News home page

చట్టసభలోకి బాలీవుడ్‌ బ్యూటీ.!

Published Sat, Oct 31 2020 8:13 AM | Last Updated on Sat, Oct 31 2020 9:33 AM

Urmila Matondkar May Elect To Maharashtra Lawmaker - Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రంగీలా ఫేమ్‌ ఊర్మిళ మటోండ్కర్‌ త్వరలో చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు. మహారాష్ట్ర శాసనమండలికి జరుగనున్న ఎన్నికల్లో అధికార శివసేన నుంచి ఆమెను ఎగువసభకు ఎన్నికకానున్నారు. మండలిలో ఖాళీ కానున్న 12 స్థానాలకు గవర్నర్‌ కోటాలో ఊర్మిళను నామినేట్‌ చేస్తారని శివసేన వర్గాల ద్వారా తెలిసింది. అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు శుక్రవారం సమావేశమైన మహా వికాస్‌ ఆఘాడీ నేతలు ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా వస్తున్న వార్తలపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. ఊర్మిళను మండలికి నామినేట్‌ చేస్తున్నారనే వార్తలు వాస్తమేనన్నారు.

అయితే దీనిపై మూడు పార్టీల నేతలు మరోసారి చర్చించి.. అనంతరం అభ్యర్థులు జాబితాను ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు పంపుతామన్నారు. దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని రౌత్‌ స్పష్టం చేశారు. ఈ జాబితాలో మరాఠీ నటుడు ఆదేష్‌ బండేకర్‌, సింగర్‌ ఆనంద్‌ షిండేతో పాటు సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకు రాజీనామా చేసిన ఖడ్సే ఇటీవల ఎన్‌సీపీలో చేరారు. దీంతో ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన ఊర్మిళ మటోండ్కర్‌ అయిదు నెలలు తిరక్కముందే కాంగ్రెస్‌ను వీడారు. (డ్రామాలాడుతున్న కంగనా : ఉర్మిళ)

పార్టీలో అంతర్గత రాజకీయాలే తన రాజీనామాకు దారి తీశాయని, పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. స్థానిక నాయకుల మధ్య సమన్వయ లేమి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కూడగట్టడం, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు నిధులు అందించడం వంటివి సరిగా చేయలేదని నిందించారు. గత మార్చిలో కాంగ్రెస్‌ గూటికి చేరిన ఆమె ముంబై ఉత్తరం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్‌ శెట్టి చేతిలో 4.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం కొంతకాలానికే శివసేన గూటికి చేరారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఇటీవల ముంబైపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఊర్మిళ మరోసారి వార్తల్లో నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement