లక్నో: ములాయం సింగ్ యాదవ్ చిన్న అపర్ణా యాదవ్ ట్విటర్‌లో షేర్ చేసిన ఫొటోపై ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ములాయం ఆశీస్సులు తీసుకున్న ఫొటోను శుక్రవారం ఆమె ట్విటర్‌లో షేర్ చేశారు. ‘బీజేపీలో చేరిన తర్వాత లక్నోలో మా నాన్న/నేతాజీ ఆశీస్సులు తీసుకున్నాను’ అని క్యాప్షన్ జోడించారు. దీనిపై ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘అంటే దీనర్థం నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) కూడా బీజేపీ గెలవాలని కోరుకుంటున్నార’ని వ్యాఖ్యానించారు.
బీజేపీకి ధన్యవాదాలు: అఖిలేశ్
అపర్ణా యాదవ్.. గురువారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. ‘వారసత్వ భారాన్ని తగ్గించినందుకు బీజేపీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఆమెను బీజేపీకి వెళ్లకుండా వారించేందుకు తన తండ్రి ములాయం సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ములాయం సింగ్ యాదవ్ తోడల్లుడు మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరడం గమనార్హం.
भारतीय जनता पार्टी की सदस्यता लेने के पश्चात लखनऊ आने पर पिताजी/नेताजी से आशीर्वाद लिया। pic.twitter.com/AZrQvKW55U
— Aparna Bisht Yadav (@aparnabisht7) January 21, 2022
టిక్కెట్ దక్కదని తెలిసి..
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ సీటు నుంచి సమాజ్‌వాదీ టికెట్‌పై పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఇక్కడి పోటీ చేయాలని భావించిన అపర్ణా యాదవ్.. సమాజ్‌వాదీ టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఆమెకు ఈసారి టిక్కెట్ ఇచ్చేందుకు అఖిలేశ్ సుముఖంగా లేకపోవడంతో తన దారి తను చూసుకున్నారు. మరి కంటోన్మెంట్ సీటును బీజేపీ ఆమెకు ఇస్తుందా, లేదా అనేది వేచిచూడాలి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రీటా బహుగుణ తన కుమారుడికి ఈ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment