
Uttar Pradesh Minister Dara Singh Chauhan: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. మరో ఓబీసీ నాయకుడు, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి దారాసింగ్ చౌహాన్ బుధవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన మర్నాడే చౌహాన్ రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. గవర్నర్ ఆనందిబెన్‌కు తన రాజీనామా లేఖ పంపిన తర్వాత చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లతో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ గత అయిదేళ్లలో వాళ్లకి చేసిందేమీ లేదని ఆరోపించారు.
దళితులు, ఓబీసీలు, నిరుద్యోగ యువతకి బీజేపీ హయాంలో న్యాయం జరగలేదన్నారు. చౌహాన్ సమాజ్‌వాదీ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. ఓబీసీ నాయకులంతా ఎస్పీలో చేరితే యాదవేతర వెనుకబడిన వర్గాల్లో ఆ పార్టీ పట్టు పెంచుకోవడానికి వీలు కలుగుతుంది. ఎన్నికల వేళ సమీకరణాలు వేగంగా మారిపోనున్నాయి. కార్మిక మంత్రిగా తాను రాజీనామా చేశాక బీజేపీలో భూకంపం వచ్చిందని స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ గూటికే చేరే అవకాశాలున్నాయంటూ సంకేతాలు ఇచ్చారు.
తన వెంట మరింత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారన్నారు. భవిష్యత్ కార్యాచరణను శుక్రవారం ప్రకటిస్తానన్నారు. బీజేపీని వీడిన మర్నాడే మౌర్యకు సుల్తాన్‌పూర్ జిల్లా కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. హిందూ దేవుళ్లపై ఏడేళ్ల క్రితం మౌర్య అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు రావడంతో అప్పట్లో కేసు నమోదైంది. ఏడేళ్ల నాటి ఆ కేసు ఇప్పుడు హఠాత్తుగా తెరపైకి వచ్చి మౌర్యకి అరెస్ట్ వారెంట్లు జారీ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment