దేవతలు నడయాడే భూమిలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధికార వ్యతిరేకతతో అల్లాడుతున్న బీజేపీ హిందుత్వ ఎజెండాను తలకెత్తుకుంటే, అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ స్థానిక అంశాల బాట పట్టింది. కొత్త తరహా రాజకీయాలతో ఆప్ కూడా మూడో పార్టీగా ఉనికిని చాటజూస్తోంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ప్రజా సమస్యలే ప్రధానంగా తెరపైకి రావడం విశేషం.
వలసలు
ఉత్తరాఖండ్ ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడ్డ రాష్ట్రం. చార్‌ధామ్ సందర్శన కోసం వచ్చే భక్తులతో కళకళలాడే ఈ రాష్ట్రం కరోనా లాక్‌డౌన్లతో రెండేళ్లుగా కల్లోల పరిస్థితిని ఎదుర్కొంటోంది. దాంతో గ్రామాల నుంచి వలసలు ఎక్కువైపోయాయి. 2011 నాటికి రాష్ట్రంలో ఏకంగా 1,034 ఘోస్ట్ (వలసలతో ఖాళీ అయిన) విలేజెస్ నమోదయ్యాయి. రవాణా, ఆసుపత్రులు, ఇంటర్నెట్ సదుపాయాలు, ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలకు కుటుంబాలు వలస బాట పట్టాయి. ఇలాంటి గ్రామాలు మరో 734 ఉన్నట్టు బీజేపీ 2017లో ఏర్పాటు చేసిన కమిషన్ తేల్చింది. వలసల నివారణకు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ పెద్దగా ప్రయత్నించలేదు.
హిందుత్వ కార్డు
రెండు నెలల క్రితం హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో పాల్గొన్న సాధువులు ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. కానీ దీన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పెద్దగా వాడుకోలేదు. రాష్ట్రంలో ముస్లిం జనాభా 14 శాతమే కావడం, హరిద్వార్, డెహ్రాడూన్, ఉద్ధమ్‌సింగ్ నగర్, నైనిటాల్‌కే పరిమితం కావడమే కారణమని భావిస్తున్నారు. బీజేపీ ఎప్పట్లా హిందుత్వ ఎజెండాతోనే దూసుకుపోతోంది. కేదార్‌నాథ్ అభివృద్ధిని ప్రతి చోటా ప్రస్తావిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీని ఎండగడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ ధామి మరో అడుగు ముందుకు వేసి తమను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని హామీ ఇచ్చారు!
చదవండి: (దేవతలు నడయాడే భూమిని అవమానిస్తే మీరు సహిస్తారా?)
బ్రాండ్ మోదీ
ఉత్తరాఖండ్‌లో మోదీకి ప్రజాదరణ ఎక్కువ. ముఖ్యంగా ఆర్మీ కుటుంబాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రధానిగా ఎనిమిదేళ్లలో ఆయన ఉత్తరాఖండ్‌కు వెళ్లినంతగా మరే రాష్ట్రానికీ వెళ్లలేదు. ఇక్కడి ప్రజలతో తన అనుబంధాన్ని చాటడానికి గణతంత్ర దినోత్సవాల్లో ఉత్తరాఖండ్ టోపీ కూడా ధరించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లోని 5 లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీయే గెలిచింది. మొత్తం 34 శాతం ఓటు షేర్ సాధించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 57 కొల్లగొట్టి విజయ దుందుభి మోగించింది. ఓట్ల శాతం 46.5కు పెరిగింది. 2019లోనూ ఐదు సీట్లూ గెలవడమే గాక ఓటు షేర్‌ను 61 శాతానికి పెంచుకుంది. కానీ కరోనా తర్వాత మోదీ ఇమేజ్ మసకబారింది. సమస్యలపై ప్రజల ఆందోళన బీజేపీని కలవర పెట్టేదే.
కీలకంగా మారిన ఆప్
ఉత్తరాఖండ్‌లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నా ఇతర పార్టీలు ఎన్ని ఓట్లు సాధిస్తాయన్న దానిపై వాటి గెలుపు ఆధారపడిందని చెప్పొచ్చు. గత నాలుగు ఎన్నికల్లో మాయావతికి చెందిన బీఎస్పీ మూడో పార్టీగా ఓట్లను చీలుస్తూ వచ్చింది. కానీ 2017 ఎన్నికల నాటికి ఆ పార్టీ ఓటు షేర్ 33 నుంచి 20 శాతానికి పడిపోయింది. ఈసారి ఎన్నికల్లో ఆప్ ఆ పాత్ర పోషించి అధికంగా ఓట్లు రాబడుతుందన్న విశ్లేషణలున్నాయి. ఆప్ మేనిఫెస్టో రూపకల్పన దగ్గర్నుంచే పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ కొత్త పంథా అనుసరించారు. వినూత్నంగా ప్రజలనే సలహాలు కోరారాయన! ఏకంగా 70 వేల స్పందనలు వచ్చాయి. ఉపాధి, విద్యుత్, రోడ్లు, ఆరోగ్యం, విద్యా రంగాలే తమకు ప్రాధాన్యమని రాష్ట్ర ప్రజలు తేల్చి చెప్పారు. అంతేగాక సీఎం అభ్యర్థిగా రిటైర్డ్ ఆర్మీ కల్నల్ అజయ్ కొథియాల్‌ను రంగంలోకి దింపి సైనికుల ఓట్లనూ కొల్లగొట్టేలా వ్యూహరచన చేశారు. ఆప్ ఏ పార్టీ ఓట్లను కొల్లగొడుతుందన్నది కూడా బీజేపీ, కాంగ్రెస్‌ల గెలుపోటములను ప్రభావితం చేయనుంది.
చదవండి: (Punjab Assembly Election 2022:సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఆ ఇద్దరు)
రెండు పార్టీలకు సవాలే
ప్రధాని మోదీ ఇమేజ్‌తో తన ఓటు షేర్ పెంచుకున్న బీజేపీ కొంతకాలంగా సమస్యలతో సతమతమవుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో లోపాలు, పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధానాలు, పెరిగిపోయిన వలసలు, ఉపాధి లేమి, ముగ్గురు సీఎంలు మారడం వంటివి కాషాయ దళానికి సమస్యగా మారాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మళ్లీ హిందుత్వ కార్డుతోనే నెగ్గాలని ఆ పార్టీ చూస్తుండగా కాంగ్రెస్ స్థానిక సమస్యలపైనే దృష్టి పెట్టింది. కానీ ఆ పార్టీ కూడా అంతర్గత కుమ్ములాటలు, తిరుగుబాటు అభ్యర్థులతో సతమతమవుతోంది. సీనియర్ నాయకుడు హరీశ్ రావత్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళుతోంది. సొంత పార్టీవారే సహకరించడం లేదంటూ ఆయన పలుమార్లు వాపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది! ఈ నేపథ్యంలో బీజేపీపై నెలకొన్న అధికార వ్యతిరేకతను కాంగ్రెస్ ఏ మేరకు అనుకూలంగా మార్చుకోగలదన్నది సందేహమేనని విశ్లేషకుల అభిప్రాయం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment