
సాక్షి, విశాఖపట్నం: దుశ్శాసనులకు తెలుగుదేశం పార్టీ కేరాఫ్ అడ్రస్ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. విజయవాడలో ఓ బాలికను టీడీపీ నాయకుడు వినోద్‌జైన్ లైంగికంగా వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశాడని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బాలిక సూసైడ్ నోట్‌ను చదువుతుంటే కన్నీళ్లు ఆగలేదన్నారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలులు వైఎస్సార్ సీపీలో ఉంటే కఠిన శిక్షలు పడతాయని చెప్పారు. ఇప్పటికే వినోద్‌జైన్‌పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారన్నారు.
ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే టీడీపీ నారీమణులు ‘నారీ సంకల్ప దీక్ష’ చేపట్టి.. చంద్రబాబు హయాంలో మహిళలకు న్యాయం జరిగిందని చెబుతుంటే మహిళలంతా నివ్వెరపోతున్నారన్నారు. చంద్రబాబు పుత్రుడు లోకేష్ పీఏ మహిళను లైంగికంగా వేధించగా, ఆమె టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించారని, దానినుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బాబు వేసిన మాస్టర్ ప్లాన్‌లో భాగమే నారీ సంకల్ప దీక్ష అని చెప్పారు. ఈ దీక్షకు చంద్రబాబు దర్శకత్వం వహిస్తే, లోకేష్ స్క్రీన్‌ప్లే రచించాడని తెలిపారు. బాబు పాలనలో మహిళలపై జరిగిన నేరాలను తెలుసుకుని టీడీపీ నారీమణులు దీక్షలు చేయాలన్నారు. గాజువాకలో లావణ్యను టీడీపీ నాయకులే హత్యచేసి రూ.10.50 లక్షలకు సెటిల్ చేసుకున్నారని చెప్పారు. పెందుర్తి నియోజకవర్గంలో దళిత మహిళను వివస్త్రను చేసి జుట్టు పట్టుకుని ఈడ్చినప్పుడు, ఏలూరులో దళిత అధికారిపై దాడి, విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌కు పాల్పడినప్పుడు టీడీపీ నారీమణులు, వంగలపూడి అనిత ఏమైపోయారని ప్రశ్నించారు.
దేశానికే ఆదర్శం దిశ
దేశానికే ఆదర్శంగా వైఎస్ జగన్ దిశ చట్టాన్ని రూపొందించి, అసెంబ్లీలో పెడితే టీడీపీ ఎమ్మెల్యేలు సభ బయట ఆ పేపర్లను చించేసిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. దిశ చట్టం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని, మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో ప్రశ్నించాలని మీ ఎంపీలను కోరాలని హితవు పలికారు. ఈ కేసుల్లో సత్వర శిక్ష పడేలా 19మంది పీపీలను నియమించారన్నారు.