
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మేనిఫెస్టో చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. చంద్రబాబు మాటల్లో నిజం ఉండదంటూ ఎద్దేవా చేశారు.
కాగా, వరుదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘అబద్ధానికి పసుపు రాసినట్టు టీడీపీ ‘మాయా’నిఫెస్టో ఉంది. 2019లో మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఇవీ అని.. చెప్పే దమ్ము టీడీపీకి లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలు నోబెల్స్ అయితే.. చంద్రబాబు ఆలోచనలు గోబెల్స్. గత టీడీపీ మేనిఫెస్టోలో కనీసం ఐదు హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. చంద్రబాబు మాటల్లో నిజం ఉండదు.
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని.. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాట తప్పిన చంద్రబాబును జనం నమ్మరు. మీ మేనిఫెస్టోను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. టీడీపీ మేనిఫెస్టో చూసి ఓటు వేస్తే ప్రజలు నిండా మునిగిపోతారు. అమ్మ ఒడి, గోరుముద్ద, స్కూల్ విద్యార్థులకు ట్యాబ్స్ వద్దనుకుంటే టీడీపీకి ఓటెయ్యాలి. టీడీపీకి ఓటు వేస్తే నాడు-నేడు, ఆరోగ్య శ్రీ కొనసాగే పరిస్థితి లేదు. బీజేపీతో కూటమి కట్టిన చంద్రబాబు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా, రైల్వే జోన్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంపై ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించవచ్చు కదా. టీడీపీది ప్రజాగళం కాదు.. యమగళం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్.. మూలపేటలో పోర్ట్.. భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. విశాఖ రాజధాని ద్వారా ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోతాయి. సీఎం జగన్ అభివృద్ధి పనులతో ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే ఉపాధి అవకాశాలు పెరిగాయి’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment