టీడీపీ హయాంలోనే.. గుళ్లు కూల్చేశారు | Vellampalli Srinivas Fires On Somu Veerraju | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలోనే.. గుళ్లు కూల్చేశారు

Published Thu, Dec 17 2020 5:27 AM | Last Updated on Thu, Dec 17 2020 7:25 AM

Vellampalli Srinivas Fires On Somu Veerraju - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందేందుకు, తిరుపతి ఉపఎన్నిక కోసమే బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ హయాంలోనే దేవాలయాల భూ ములు అమ్మేశారని.. గుళ్లు కూల్చేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సెంటు కానీ ఒక్క గజం కానీ దేవాలయాల భూమి అన్యాక్రాంతం కాలేదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చివేస్తుంటే ఎందుకు మాట్లాడలేదని సోము వీర్రాజును ప్రశ్నించారు. ఈ రోజు సర్జికల్‌ స్ట్రైక్‌ అని మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. ఆరోజు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆలయాలు కూల్చివేసినప్పుడు బీజేపీలో ఉన్న తాను విజయవాడ బంద్‌కు పిలుపునిచ్చానని చెప్పారు. ఈ బంద్‌ పిలుపుతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ ప్రకటించిన విష యం వాస్తవం కాదా? అని నిలదీశారు. విజయవాడలో రూ.437 కోట్ల విలువ చేసే 14 ఎకరాల దుర్గగుడి భూములను సిద్ధార్థ విద్యాసంస్థలకు కేవలం రూ.21 లక్షలకు అప్పగించారని.. ఆ సంస్థ ఏమైనా ఉచితంగా బోధిస్తోందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కూల్చిన వాటిలోని పలు ఆలయాలను  మళ్లీ నిర్మించాలని  ఆదేశాలిచ్చామని చెప్పారు. 

మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నప్పుడే.. 
దేవదాయ శాఖ మంత్రిగా బీజేపీ నేత మాణిక్యాలరావు ఉన్నప్పుడే చాలా చోట్ల దేవాలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఈ విషయం వీర్రాజుకు తెలియదా అని మంత్రి వెలంపల్లి నిలదీశారు. ‘ఆనాడు మంత్రాలయంలోని భూములను అన్యాక్రాంతం చేశారు. దేవాలయ భూములను విశాఖలో ఓ రిసార్టుకు ఇచ్చారు. సదావర్తి భూములైన 83 ఎకరాలను అమ్మకానికి పెట్టారు. ఇవన్నీ వాస్తవం కాదా?’ అని మంత్రి ప్రశ్నించారు. వీటిని అడ్డుకోవడానికి ఆరోజు పోరాడింది వైఎస్సార్‌సీపీ నాయకులేనని గుర్తు చేశారు. చర్చీలకు డబ్బులిస్తున్నారని విమర్శిస్తున్న వారికి.. రూ.70 కోట్లతో అభివృద్ధి చేస్తున్న దుర్గగుడి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నందుకు, అన్యాక్రాంత భూములను వెనక్కి తీసుకున్నందుకు తాను రాజీనామా చేయాలా అని మంత్రి ప్రశ్నించారు. విద్వేషాలు రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement