
నెల్లూరు (టౌన్): కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫలితాలపై సమీక్ష సందర్భంగా పార్టీకి వీర విధేయులుగా ఉన్న పలువురు సీనియర్ నేతలను సస్పెండ్ చేయడం, మరి కొందరిని పార్టీ నుంచి తొలగించడం, ఇంకొందరిని సంజాయిషీ కొరడంతో ఆ పార్టీలో నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ అధినేత ఎన్నికల్లో తప్పులు చేసిన పెద్దలను వదిలి చిన్నచిన్న నాయకుల మీద చర్యలు తీసుకోవడం, ఆగ్రహం వ్యక్తం చేయడంపై తమ్ముళ్లు మండి పడుతున్నారు. అధినేత తీరును నిరసిస్తూ ఆదివారం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్‌యాదవ్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మంగళవారం మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో 25వ డివిజన్ నుంచి 54వ డివిజన్ వరకు పార్టీ జిల్లా నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ లోపే మరి కొంత మంది మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అభ్యర్థుల విషయంలో ఎవరిని సంప్రదించకుండానే ఇళ్లల్లో కూర్చొని ప్రకటించారని డివిజన్ నాయకులు చెబుతున్నారు. కనీసం పోటీ ఇచ్చే వారిని కూడా బరిలో నిలపకుండా డబ్బులు తీసుకుని డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపిస్తున్నారు.
అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా ఎలాంటి సంబంధం లేని తమపై చర్యలు తీసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా పార్టీ ఇంతగా భ్రష్టుపట్టడానికి కారణమైన సిటీ, రూరల్ నియోజకవర్గాల ఇన్‌చార్జిల తీరు నిరసిస్తూ ఇటీవల ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఏకమై నినదించిన విషయం తెలిసిందే. మంగళవారం తర్వాత వీరిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక వేళ వారిపై చర్యలు తీసుకోకపోతే సిటీ, రూరల్ నియోజకవర్గాల్లోని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్ మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment