
ప్రసంగిస్తున్న మంత్రి విడదల రజిని
లబ్బీపేట (విజయవాడ తూర్పు): అడ్డదారిలో రాజకీయాలు చేసి లబ్ధిపొందాలని చూడటం టీడీపీ అధినేత చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఏపీఐఐసీ కాలనీ, గుణదల గంగిరెద్దుల దిబ్బలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఆమె వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చంద్రబాబునాయుడు చూస్తుంటారని విమర్శించారు. భారతమ్మ మహిళా పారిశ్రామికవేత్తగా అందరికీ ఆదర్శంగా ఉన్నారని, గొప్ప మానవీయ విలువలు ఉన్న మహిళ అని కొనియాడారు. అలాంటి భారతమ్మపై చంద్రబాబు, కొంతమంది టీడీపీ నాయకులు అబద్ధపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిసంగతి తేలుస్తామని హెచ్చరించారు.
మహిళలను గౌరవించే సంస్కృతిని వదిలి టీడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైద్య, ఆరోగ్యరంగం గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క మెడికల్ కళాశాలను స్థాపించలేదని, ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించకుండా, ఆ పథకానికి జీవం లేకుండా చేశారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు నిర్మించాలనే కనీస స్పృహ కూడా లేకుండా పరిపాలన కొనసాగించిన అసమర్థ నాయకుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్యరంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశం మనవైపు చూసేలా చేశారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్, డీఎంహెచ్‌వో డాక్టర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment