సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, టీడీపీ, జనసేన, సీపీఐ, ఎల్లో మీడియా కలిసినా ప్రజలు వైఎస్సార్ సీపీకి పట్టం కట్టారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. బేవర్స్ రాజకీయాలు చేసే వ్యక్తి సబ్బం హరి అంటూ మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ మంత్రి లోకేష్ బాబు ఏపీకి టూరిస్టులంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడా ఓటు అడగలేదు. అయినా ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారు. మూడు రాజధానులకు ప్రజలు మద్దతు తెలిపారు. చంద్రబాబు, పప్పు నాయుడు నీతి మాలిన రాజకీయాలు చేశారు. విజయవాడ, గుంటూరు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాల రోజు రాష్ట్రంలో లేకుండా పోయారు.
‘ప్రజలు పాచి పనులు చేయడానికి వెళ్లారు’ అంటున్న చంద్రబాబు హైదరాబాద్ మీరు ఎందుకు వెళ్లారు?. మీరు మీ కుమారుడు పాచి పనులు చేయడానికి హైదరాబాద్ వెళ్లారా?. చంద్రబాబు పుత్రుడు.. దత్త పుత్రుడు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు. 2019లో గెలిస్తే ఈవీఎం ట్యాపింగ్ చేశారని చంద్రబాబు మాట్లాడాడు. ఈ గెలుపుపై చంద్రబాబు ఏమి సమాధానం చెబుతారు. ఓడిపోయిన స్థానాలపై సమీక్ష నిర్వహిస్తాము. పార్టీ గెలుపు కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment