
హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాకతో నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం మరింత జోరందుకుంది. హాలియాలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రచార సభను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రచార సభలో సీఎం ప్రసంగం పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే ఉందని విమర్శించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు . ఈ విషయం కేసీఆర్ కళ్లల్లో స్పష్టంగా కన్పిస్తోందని విజయశాంతి తెలిపారు.
అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతలను కూడా విజయశాంతి విమర్శించారు. కేసీఆర్, జానారెడ్డిలు తోడు దొంగలని, వారు మంచి మిత్రులనే విషయాన్ని గుర్తుచేశారు. ఒప్పందం ప్రకారమే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతిని సరైన సమయంలో ప్రజల ముందు ఉంచుతామని విజయశాంతి తెలిపారు. హాలియాలో జరిగిన ప్రచార సభలో సీఎం పోడు భూముల సమస్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలకాయలు చావు నోట్లో ఉన్నాయని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంబేడ్కర్ జయంతికి కనీసం నివాళులర్పించలేని పరిస్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. అంతేకాకుండా, సీఎం కేసీఆర్ దొంగ నిరాహార దీక్ష వలన తెలంగాణ రాలేదని అభిప్రాయపడ్డారు. ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment