సాక్షి, హైదరాబాద్: ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్ మాత్రం తప్పటడుగులు వేస్తూ ఇప్పటివరకు స్థిరంగా నిలదొక్కుకోలేకపోయాడు. తాజాగా బీజేపీకి కూడా రాజీనామా చేశాడు విక్రమ్.
ఏమీ ఆశించకుండా బీజేపీ కోసం పనిచేసినా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదంటూ విక్రమ్ గౌడ్ విమర్శలు చేశారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్‌కు ఆయన లేఖ రాశారు. ఇక, లేఖలో..‘పార్టీలో కొత్త వారిని అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారు పేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే కొందరు చోద్యం చూస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా గుర్తింపు ఇవ్వడం లేదు.
ప్రజా బలం లేనివారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఓటమికి, నేతల అసంతృప్తిపై ఎవరూ బాధ్యత తీసుకోలేదు. ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు’ తెలిపారు. ఇదిలా ఉండగా.. విక్రమ్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.
రాజకీయాల్లోకి వచ్చే విషయంలోనూ విక్రమ్ వేసిన తప్పటడుగులు.. ఆయన కెరియర్‌ను దెబ్బతీశాయి. గన్నుతో తనను తాను కాల్చుకుని సానుభూతి పొందాలనుకోవడం సంచలనంగా మారింది, కేసులకు దారి తీసింది. ఆ తర్వాత కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తొందరగా పార్టీలు మారడం విక్రమ్ ఎంత వరకు మేలు చేస్తాయో.. ముందు ముందు చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment