
సాక్షి, అమరావతి: ఎన్నికల యాప్‌కు సంబంధించి తలెత్తిన అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాప్ వివరాలను ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరమేమిటో చెప్పాలన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ‘కేంద్ర ఎన్నికల సంఘం లాగా ఈ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను మీరు పరిగణనలోకి తీసుకుంటారా? సహజంగా ఇలాంటి వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ అదీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం గానీ నిర్వహిస్తుంటుంది. మరి ఈ ప్రత్యేక యాప్‌ను ఎవరు తయారు చేశారు? ఈ యాప్ విషయాలను ఎందుకు రహస్యంగా ఉంచారు? ఇది ఎన్నికల సెల్ పర్యవేక్షణలో తయారైందా? లేదా? అనే విషయం ప్రకటిస్తే ఇంకా మంచిది. ఇది ఒక రాజకీయ పార్టీ తయారు చేసిన యాప్ అంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. వాస్తవమేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఉంది’ అని విష్ణువర్ధన్‌రెడ్డి ట్వీట్ చేశారు.
ఉండవల్లి వ్యాఖ్యలు దేశభద్రతకే ముప్పు..
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అర్థం పర్ధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేత సుదీష్ రాంబొట్ల విమర్శించారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి వ్యాఖ్యలను ఖండించకపోతే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందన్నారు. వివేకానంద, అంబేడ్కర్ రచనలను వక్రీకరించారని.. ఈ అంశాలపై చర్చకు రావాలని ఉండవల్లికి సవాల్ విసిరారు.