ఔరంగాబాద్: దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు సైతం రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టేసారు. ఇందులో భాగంగానే బీహార్‌లోని ఔరంగాబాద్‌లో జరిగిన ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్' కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో గూండా రాజకీయం పెరిగిపోయిందని, వంశపారంపర్య రాజకీయాలకు ముగింపు పలకడానికి ఎన్డీయేకి ఓటు వేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రజలను కోరారు. జరగబోయే ఎన్నికలు ఒక కుటుంబానికి.. దేశానికి మధ్య జరుగుతోందని అన్నారు. వంశపారంపర్య రాజకీయం దేశాన్ని ఉగ్రవాదం, అవినీతి వైపు నెడుతోందని పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన భారత్ ప్రధాని మోదీ కల. గత పదేళ్లుగా మారుతున్న భారత్‌ను మోదీజీ నాయకత్వంలో చూసారు. ఇప్పటికే భారతదేశ ప్రతిష్ట ప్రపంచమంతటా తెలిసింది. రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుతుందని అన్నారు.
నేడు యూపీలో కర్ఫ్యూ లేదు, అల్లర్లు లేవు.. బీజేపీ ప్రభుత్వం తమ వాగ్దానాలకు కట్టుబడి ఉంది. మాఫియా, నేరస్థులు జైలులో మగ్గుతున్నారు. మహిళలను బెదిరించడానికి సాహసించాలంటే నేడు అందరూ జంకుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్, వికసిత్ బీహార్‌ను సాధ్యం చేస్తుందని.. అది మోదీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు.
కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన ఆర్జేడీ.. రాముడి ఉనికిని ప్రశ్నించేవి, కానీ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత, వారు ట్రాక్ మార్చి.. రాముడు అందరికీ చెందినవారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి ఎన్డీఏ కూటమిని గెలిపించండని యోగి ఆదిత్యనాథ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment