
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ దళిత, గిరిజన బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలపై దాడులు పెరుగుతున్నాయని, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు తెలంగాణలో ఇద్దరు దళితులు ప్రభుత్వ పాశవిక విధానాలకు బలయ్యారని, ఇంత ఘోరాలు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లోని వర్గల్ మండలం వేలూరులో తన భూమి ప్రభుత్వం గుంజుకుందన్న ఆవేదనతో ఓ దళిత యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ప్రభుత్వం చేసిన హత్యనేనని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజపూర్ మండలం తిరుమలపూర్ గ్రామంలో ఓ దళిత యువ రైతును ఇసుక మాఫియా లారీతో తొక్కి హత్య చేసిందని, ఈ విషయంలో దోషులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల వారికి న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని, ఒకట్రెండు రోజుల్లో గవర్నర్ ను కలసి వినతిపత్రం ఇస్తామని, తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలసి ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. దళితులకు న్యాయం జరిగే వరకు రాష్ట్రంలో అందరినీ కలుపుకుని కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఆ ప్రకటనలో భట్టి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment