
సాక్షి, హైదరాబాద్: బీజేపీని 2023 ఎన్నికల్లో గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముం దుకు సాగుతామని ఆ పార్టీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. ఓబీసీ మోర్చా అధ్యక్షునిగా లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ నియమితులైన సందర్భంగా వారు ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిం దని, ఆ నమ్మకాన్ని నిలబెడతామని పేర్కొన్నారు. ఆపరేషన్ 2023 లక్ష్యంగా ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.
పార్టీ నాయకత్వం కట్టబెట్టిన ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్ష బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తా. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ నినాదానికి అనుగుణంగా కేంద్ర పథకాలను ప్రజల దరికి చేరుస్తా. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఓబీసీలు పార్టీ వైపు ఆకర్షించేలా కృషి చేస్తా. తెలంగాణ, ఏపీలో 50 శాతం ఉన్న బీసీ సామాజిక వర్గాలను పార్టీకి చేరువ చేస్తా, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే ధ్యేయంగా పనిచేస్తా. రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆ దిశలో పనిచేస్తోంది. నేను అందుకు తోడ్పాటునిస్తా. అందుకోసమే
పార్టీ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తోంది. – కె. లక్ష్మణ్
రాష్ట్రంలో బీజేపీని 2023లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా జాతీయ పార్టీ ఈ బాధ్యతలు అప్పగించింది. పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ పటిష్టతకు పనిచేస్తున్నా. ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించడంతో బాధ్యత మరింత పెరిగింది. ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని, పథకాలను ప్రజలకు వివరించడం ద్వారా పార్టీని వారికి చేరువ చేస్తా. టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం, ప్రజల సంక్షేమం కోసం కేంద్రం చేస్తున్న కృషిని వివరించడమే నా ధ్యేయం. – డీకే అరుణ
Comments
Please login to add a commentAdd a comment