
ఢిల్లీ/కోల్‌కతా: టీచర్ల నియామక కుంభకోణం ఆరోపణలతో పశ్చిమ బెంగాల్ సస్పెండెడ్ మంత్రి పార్థ ఛటర్జీ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. పార్థకు దగ్గరి సంబంధాలున్న అర్పితా ముఖర్జీ ఇంట నోట్ల గుట్టలు వెలుగు చూడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో.. ఇప్పుడు దర్యాప్తు సంస్థ లిస్ట్‌లో మరో తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.
ప్రముఖ వ్యాపారవేత్త, రాయ్‌గంజ్ టీఎంసీ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. అతిత్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. కృష్ణ కళ్యాణి.. కళ్యాణి సోల్వెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఫుడ్ మ్యానుఫ్యాక్చురింగ్ కంపెనీని నడుపుతున్నారు. అయితే కోల్‌కతాకు చెందిన రెండు ఛానెల్స్‌తో ఆయన కంపెనీ నిర్వహిస్తున్న లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన కంపెనీ ఆర్థిక లావాదేవీలపై గత కొంతకాలంగా ఈడీ నిఘా కొనసాగుతోంది.
ఈ క్రమంలో.. రేపో, మాపో ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేయొచ్చని ఈడీ వర్గాలు చెప్తున్నాయి.
ఇదిలా ఉంటే.. 2021లో బీజేపీ టికెట్ తరపున గెలుపొందిన కృష్ణ కళ్యాణి.. పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలోకి మారిపోయారు. ఆ టైంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని ఆయనపై బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రస్తుతం టీఎంసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ బాధ్యతలు వహిస్తున్నారు ఈయన.
2016లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న టైంలో టీచర్ నియామకాల అవకతవకలకు పాల్పడినట్లు పార్థా ఛటర్జీపై ఆరోపణలు వెల్లువెత్తగా.. ఆయన సన్నిహితురాలు.. నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ. 50 కోట్లకు పైగా నగదు, ఐదు కేజీలకు పైగా బంగారం బయటపడింది. అదంతా మంత్రి పార్థా ఛటర్జీ సొమ్మేనని, ఆయన తన ఇంటిని మినీ బ్యాంకుగా వాడుకునే వాడంటూ అర్పిత వాంగ్మూలం ఇచ్చింది. ఇక రాజకీయ విమర్శలు.. సొంత పార్టీ నేతల ఒత్తిడితో ఆయనపై వేటు వేస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది.
ఇదీ చదవండి: బొగ్గు కుంభకోణంలో మాజీ కార్యదర్శి దోషే: కోర్టు
Comments
Please login to add a commentAdd a comment