ముంబై: మహారాష్ట్ర సీఎం బాధ్యతలను ఏక్‌నాథ్ షిండేకు అప్పగిస్తూ బీజేపీ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఈ పరిణామం వెనుక అనేక కారణాలున్నాయి. బీజేపీ అన్ని కోణాల్లోనూ ఆలోచించాకే ఈ అడుగు వేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. అందులో ముఖ్య కారణాలేవంటే..
► 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఉమ్మడిగా పోటీ చేశాయి. ఫలితాలు వెలువడ్డాక సీఎం పదవి చేపట్టే విషయమై విభేదాలు తలెత్తి రెండు పార్టీలు విడిపోయాయి. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో అనూహ్యంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ హడావుడి పొత్తు ఎంతోకాలం కొనసాగలేదు. ఫడ్నవీస్ దిగిపోయారు. ఈ పరిణామం మాత్రం బీజేపీకి అధికార కాంక్ష ఎక్కువనే అభిప్రాయం కలిగించింది. అందుకే, తమకు అధికారం ముఖ్యం కాదనే అభిప్రాయం కలిగించడానికి తాజాగా ఏక్‌నాథ్ షిండేను సీఎంగా బలపరిచింది.
చదవండి👉🏻ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ..
► సీఎం పదవికి రాజీనామా చేసిన ఉద్ధవ్ ఠాక్రే పదవి నుంచి దిగిపోతూ బీజేపీ తనను వెన్నుపోటు పొడిచిందనే భావం ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించారు. బాలా సాహెబ్ కొడుకుని మీరు(బీజేపీ) గద్దె దించారు’ అంటూ రాజీనామా సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల్లో ఉద్వేగాలను రగిలించి, సానుభూతి పొందడంలో సఫలమయ్యారు.
► అదే సమయంలో బీజేపీ కూడా శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ వారసత్వానికే తాము మద్దతిస్తామనే ఇమేజ్‌ను ప్రజల్లో కలిగించాలని కోరుకుంది. బాలాసాహెబ్ ఆకాంక్షల మేరకు శివసైనికుడే సీఎం పదవిలో ఉంటారని చెప్పడంలో ఆంతర్యం కూడా ఇదే.
► మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో అసలైన శివసేన ఎవరిదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరికొంత కాలం ఈ ప్రశ్నకు సమాధానం దొరక్కపోవచ్చు. బాలాసాహెబ్ నిజమైన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతామని ఏక్‌నాథ్ షిండే అంటున్నారు. అసలైన శివసేన తమ వెంటే ఉందని చెబుతూ 2024 ఎన్నికలకు వెళ్తే సానుకూలత ఉంటుందని కూడా బీజేపీ భావిస్తోంది.
► ఏక్‌నాథ్ షిండేకు ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మద్దతిచ్చినా మున్ముందు రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. అయితే, ప్రభుత్వాన్ని వీరే నడుపుతూ ఉంటే శివసేనను వీడేందుకుసుముఖంగా ఉండకపోవచ్చు. రెబెల్స్ శిబిరాన్ని చెదరకుండా ఉంచేందుకే బీజేపీ సీఎం పదవిని వదులుకుందని భావిస్తున్నారు.
చదవండి👉🏻నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment