
ఢిల్లీ: బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడిని 15 రోజుల్లో నియమించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో, జేపీ నడ్డా వారసుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష రేసులో కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో కొత్త చీఫ్‌ను వెతికే పనిలో ఉంది కాషాయ పార్టీ. ఈ నేపథ్యంలో మార్చి 15వ తేదీ నాటికి కొత్త జాతీయాధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపారు. అయితే, బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలి. ఇప్పటికి 12 రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి అయ్యింది. మరో ఆరు రాష్ట్రాల్లో యూనిట్ చీఫ్‌ల ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడు, బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
మరోవైపు.. బీజేపీ అధ్యక్షుడి రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర బీజేపీ అగ్రనేత వినోద్ తావడే, బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్లు ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. 2019లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నడ్డా పార్టీ బాధ్యతను స్వీకరించారు. జనవరి 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి నడ్డా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాగా, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని జూన్ 2024 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో, కొత్త అధ్యక్షుడి కోసం బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కీలక బాధ్యతలు ఎవరికీ ఇస్తారనే చర్చ మొదలైంది. బీజేపీ హైకమాండ్ సైతం పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లను కూడా తమ దృష్టిలో ఉన్న వారి పేర్లను పంపించాలని కోరినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment