పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి హామీ పొందకుండానే హస్తం గూటికి చేరారా? సీట్ల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్‌కు ఎలాంటి కండిషన్స్ విధించలేదా? తాను పోటీ చేసే సీటు కూడా ఫైనల్ చేసుకోలేదా? ఎలాంటి హామీ లేకుండానే కాంగ్రెస్‌లో చేరడం వెనుక పొంగులేటికి ఉన్న వ్యూహమేంటి? ఏ ధైర్యంతో కండిషన్స్ ఏమీ లేకుండానే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు? వాచ్ దిస్ స్టోరీ..
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పట్టు ఉందని చెప్పుకుంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేముందు ఎలాంటి షరతులు విధించలేదని తెలుస్తోంది. తన వర్గానికి చెందిన ఐదుగురికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తేనే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరతారంటూ తొలుత ప్రచారం సాగింది. ఒకానొక సమయంలో కనీసం తనతో పాటు మరో ఇద్దరికి సీటు గ్యారెంటీ ఇవ్వమని కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరినట్లు టాక్ నడిచింది. అయితే ఫైనల్‌గా ఎలాంటి షరతులు లేకుండానే బేషరతుగా పొంగులేటి కాంగ్రెస్‌లో చేరినట్లు చెబుతున్నారు. దీని వెనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెద్ద వ్యూహమే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వారి అభిప్రాయం మేరకే కాంగ్రెస్‌లోకి..
గులాబీ పార్టీకి దూరమయ్యాక..పొంగులేటి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరతారంటూ ప్రచారం జరిగింది. జిల్లాలోని అని నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన పొంగులేటి తన అనుచరుల అభిప్రాయాలు స్వీకరించారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆయనతో చర్చలు జరిపాయి. తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించాయి. కర్నాటక ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూసిన పొంగులేటి అక్కడి ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో ఆయన కూడా హస్తం పార్టీవైపే మొగ్గు చూపించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రధాన అనుచరులను ఖమ్మం పిలిపించుకొని వారి అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలందరూ కూడా కాంగ్రెస్ లోనే చేరాలని సూచించినా..అంతిమ నిర్ణయం పొంగులేటికి వదిలేశారు. అన అనుచరుల నిర్ణయమే తన నిర్ణయమని పొంగులేటి ప్రకటించారు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర నేతలు పొంగులేటిని కలిసి కాంగ్రెస్‌లో చేరాలంటూ ఆహ్వానించారు. ఆ విధంగా పొంగులేటి కాంగ్రెస్‌లో చేరారు.
నో కండీషన్స్..
అయితే కాంగ్రెస్ లో చేరడానికి ముందు పొంగులేటి ఎలాంటి షరతులు పెట్టలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఓ కారణం ఉందంటున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో సర్వే ఆధారంగానే అభ్యర్థులను నిర్ణయించాలని కాంగ్రెస్ నాయకత్వం చెబుతోంది. సర్వే చేస్తే అన్ని నియోజకవర్గాల్లో కాకపోయినా.. మెజారిటీ సీట్లలో తన అనుచరులే ముందుంటారని పొంగులేటి విశ్వసిస్తున్నారు. అందుకే ముందుకు షరతులు విధిస్తే మంచిది కాదని..సర్వే ఆధారంగా టిక్కెట్లు ఇచ్చినా తన వర్గానికి నష్టం ఉండదని భావించే షరతులు లేకుండానే హస్తం తీర్థం తీసుకున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో తనకు తన వర్గానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే పొంగులేటి వ్యూహాత్మకంగా నడుచుకున్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు.
పొంగులేటి పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గం కూడా నిర్ణయించలేదని, ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ సీట్లలో ఏదో ఒకదానిలో ఆయన పోటీ చేస్తారని అంటున్నారు. అయితే ఖమ్మం నుంచే పొంగులేటి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముందు ముందు ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: భూదాన్ భూముల వద్ద ఉద్రికత్త.. పోలీసుల లాఠీచార్జ్!
Comments
Please login to add a commentAdd a comment