Why Telangana BJP Slowed Is It Munugode Bypoll Defeat Effect - Sakshi
Sakshi News home page

ఎక్కడో తేడా కొట్టింది?.. తెలంగాణలో బీజేపీ స్పీడ్ ఎందుకు తగ్గింది?

Published Sun, Dec 18 2022 3:13 PM | Last Updated on Sun, Dec 18 2022 4:00 PM

Why Telangana BJP Slowed Is It Munugode Bypoll Defeat Effect - Sakshi

తెలంగాణలో కమలం పార్టీ వేగం తగ్గిందా? మునుగోడు తర్వాత నేతల్లో నిస్తేజం ఆవిరించిందా? రాష్ట్ర పార్టీ చీఫ్ పాదయాత్రపైనే ఫోకస్ పెట్టారా? సీనియర్ల సేవల్ని ఉపయోగించుకోవడంలో కాషాయసేన వెనుకబడుతోందా? బీజేపీ స్పీడ్ తగ్గడానికి కారణం ఎవరు? లోపం ఎక్కడుంది? 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలంగాణ బీజేపీ నాయకులు చాన్నాళ్ళ నుంచి అనుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ కూడా వారికి ఆమేరకు దిశా నిర్దేశం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఇతర పార్టీలను ఆకర్షించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈటల రాజేందర్ను ఆకర్షించి మళ్ళీ అసెంబ్లీకి ఎన్నికయ్యేలా కమలనాథులు కృషి చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌ని బీజేపీలోకి ఆకర్షించినప్పటికీ.. ఉపఎన్నికల పోరాటంలో విజయం దక్కలేదు. కాని కమలానికి పునాదులు లేని నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ను వెనక్కు నెట్టేసి..టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చాటుకున్నారు కమలనాథులు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ప్రముఖులు బీజేపీలో చేరుతున్నారే గాని..వారి సేవల్ని సక్రమంగా వినియోగించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మునుగోడు వ్యూహం ఎదురు తన్నిందా?
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డి విజయం సాధిస్తారనే స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ మేరకు బీఆర్ఎస్ నాయకత్వానికి కంగారు పుట్టించారు కూడా. కాని ఫలితం దక్కలేదు. రాజగోపాల్రెడ్డిని విజయం వరించలేదు. దీంతో నాయకుల్లో స్పీడ్ తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఇప్పటివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పూర్తిగా తన ప్రజా సంగ్రామ యాత్ర మీదే పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.

మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ఏ మాత్రం అవకాశం దొరికినా తన సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినపుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మినహా మిగతా నేతలు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. బండి సంజయ్ మాత్రమే ఫోకస్ కావాలనే ఉద్దేశంతో మిగతా నేతలను పాదయాత్రకు సంఘీభావంగా వెళ్ళాలని సూచించలేదా? లేక సంజయ్ పాదయాత్రను మిగతా నాయకులు లైట్ తీసుకున్నారా ? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

రెయిడ్స్ వర్సెస్ రెయిడ్స్
తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. ఎన్నికలు ఏడాదిలోపే ఉండటంతో మూడు ప్రధాన పార్టీలు కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాయి. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా అదే రేంజ్లో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఒకవైపు లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు...  ఇంకోవైపు రాష్ట్ర మంత్రులపై ఈడీ విచారణ సాగుతోంది.

ఇదిలా ఉంటే..తెలంగాణలో గులాబీ పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో కమలం పార్టీ నేతలు వెనకబడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బండి సంజయ్ తన పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నా.. ఆయనకు సపోర్టింగ్ గా ఇతర నేతలు ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. దీంతో బీజేపీ వాయిస్ పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లలేకపోతుందనే టాక్ వినిపిస్తోంది.

సీనియర్స్ స్ట్రాటజీ ఏంటీ?
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి కోసం రాష్ట్రంలోని పెద్దా, చిన్నా నాయకులంతా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఉప ఎన్నిక హడావుడి ముగియగానే వీరంతా సైలెంట్ అయిపోయారు. బండి సంజయ్ తనయాత్రలో మునిగిపోవడం..ఇతర నేతల మధ్య పనివిభజన లేకపోవడంతో ఎవరికీ పని లేకుండా పోయింది. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం మినహా నాయకులకు దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు.

ఒకప్పుడు బీజేపీ నాయకులు చాలా కొద్దిమందే ఉండేవారు. ఇతర పార్టీలనుంచి వచ్చినవారితో ఇప్పుడు కమలం పార్టీ నిండుగా కనిపిస్తోంది. కాని సీనియర్ల సేవలను సరిగా వినియోగించుకోలేకపోవడం ఒక లోపంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా  సీనియర్లను ఖాళీగా ఉంచడం వల్ల పార్టీకి నష్టం కలుగచేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement