బీఆర్‌ఎస్ నేతల మాటలకు విలువ లేదు: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ‘మెడిగడ్డ బ్యారేజీలోని ఒక్క పిల్లర్ కుంగితేనే ఇంత రాద్దాంతమా?’అంటూ బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రం, రైతాంగ ప్రయోజనాలను పణంగా పెడుతూ మాట్లాడటం దురదృష్టకరమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎన్‌ఏ నిపుణుల కమిటీ సూచనలనే పాటిస్తుందని, బీఆర్‌ఎస్ నేతల మాటలకు విలువ లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలన కోసం ఈ నెల 6న నిపుణుల కమిటీ రానుందని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు.
కుంగిన మేడిగడ్డ బ్యారేజీని ఎన్డీఎస్‌ఏ నిపుణులు పరిశీలించి నీటిని ఖాళీ చేయాలని సూచించారని, బీఆర్‌ఎస్ నేతలు రాజకీయాలు చేస్తూ మళ్లీ నీటితో నింపాలని డిమాండ్ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని ఉత్తమ్ విమర్శించారు. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ.. ఇలా అన్ని విషయాలల్లో గత ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కడంతో రూ. 94 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యల్లో చిక్కుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment