జాతీయ మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలవండి
జాతీయ మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది
30కి పైగా హత్యలు.. 1000కి పైగా దాడులు
వందల్లో హత్యాయత్నాలు, ఊరూరా విధ్వంసాలు
ఎంపీలే బయట తిరగలేని పరిస్థితి
దమనకాండకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వీక్షించండి
ఇలాంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగొచ్చా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన శాంతి భద్రతలు, కక్షసాధింపు చర్యలు, దాడులు, అరాచకాలపై అందరూ గళం విప్పాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో అండగా నిలవాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ప్రజాస్వామ్యవాదులందరితో కలసి అరాచకాన్ని అడ్డుకుందామన్నారు. ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మీ ఇంట్లోకి చొరబడి దాడి చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని మీరెలా ఎదుర్కొంటారు? దానిపై మీరెలా స్పందిస్తారు? దయచేసి ఇక్కడి గ్యాలరీలో ఫొటోలు, వీడియోలు చూడండి.
ఆంధ్రప్రదేశ్‌లో దారుణ పరిస్థితి గురించి తెలుసుకోండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో అండగా నిలవండి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విధ్వంసకాండను నిరసిస్తూ బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా, దాడుల తాలూకు ఫొటో గ్యాలరీని ప్రారంభించిన సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి, చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికి విఘాతం కలిగిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని యావత్ దేశం దృష్టికి తెచ్చేందుకు ఇక్కడ నిరసన చేపట్టినట్లు తెలిపారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచక, ఆటవిక పాలన సాగుతోందని, అంతులేని దారుణాలు జరుగుతున్నాయని చెప్పారు. అరాచకాలు, అమాననీయ ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూపుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి కొనసాగడం సబబేనా అని ఆలోచించాలన్నారు.
యథేచ్ఛగా దాడులు, విధ్వంసాలు
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్ జగన్ తెలిపారు. యథేచ్ఛగా హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం సాగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీని అణగదొక్కడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 36 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు, 560 చోట్లకు పైగా ప్రైవేటు, 490 చోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు చేశారని చెప్పారు. చినీ తోటలు కూడా ధ్వంసం చేశారన్నారు.
నారా లోకేశ్ ఒక మంత్రిగా ఉండి.. రెడ్‌బుక్ పేరిట హోర్డింగ్‌లు పెట్టారని, ఎవరెవరి మీద దాడులు చేయాలి.. ఎవరిని ఎలా వేధించాలన్న వివరాలు అందులో రాసినట్లు స్వయంగా ప్రకటించారని తెలిపారు. అధికార పార్టీ శ్రేణులు ఎలాంటి దాడులు, ఆస్తుల విధ్వంసం చేసినా, ఏ చర్యా తీసుకోవద్దని రాష్ట్ర పోలీసులకు స్పష్టంగా నిర్దేశించారని చెప్పారు. ఆ రెడ్‌బుక్‌ను రాష్ట్రంలో అంతటా హోర్డింగ్‌ల ద్వారా ప్రదర్శించడమే కాకుండా, దాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లారన్నారు. ఆ విధంగా రాష్ట్రంలో ఇప్పుడు భారత రాజ్యాంగం కాకుండా, రెడ్‌బుక్ రాజ్యాంగం పని చేస్తోందని తెలిపారు.
మేం దాడులను ప్రోత్సహించలేదు
గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలేవీ జరగలేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం, ఇళ్లలోకి చొరబడి వేధింపులు, దాడులు ఎక్కడా జరగలేదని.. పౌర హక్కులకు భంగం కలిగించలేదని వివరించారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వాటన్నింటినీ వెంటనే ఆపలేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేమన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం, చీనీ తోటల ధ్వంసం.. వీటన్నింటిపై ఫొటో గ్యాలరీతో పాటు వీడియోలు కూడా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ‘దయచేసి ఒక్కసారి ఈ ఫొటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణ పరిస్థితిని అర్థం చేసుకోండి. మా పార్టీ ప్రజా ప్రతినిధులు.. చివరకు ఒక ఎంపీ కూడా తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. ఎంపీ మిథున్‌రెడ్డిపై పట్టపగలే రాళ్లతో దాడి చేసి వాహనాలు ధ్వంసం చేశారు. ఇన్ని జరుగుతున్నా, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.
ఆ విధంగా రాజ్యాంగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు’ అని చెప్పారు. రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న వారి నుంచి బాధితులను కాపాడకపోగా, తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత కంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇలాంటి దుస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి అండగా నిలవకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేమన్నారు.
ఢిల్లీ ధర్నాకు హాజరైన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు
మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిపై ఫొటో, వీడియోల ప్రదర్శన అనంతరం కార్యక్రమానికి వచ్చిన వారందరికీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ‘నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సోదరుడు, స్నేహితుడు, అక్క, చెల్లెమ్మకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మరోవైపు ఇక్కడికి రాలేకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం తెలిపిన అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవ్వాతాతలు అందరికీ మనసారా కృతజ్ఞతలు.
నిరసన ప్రదర్శనకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవడంతోపాటు వాటిపై అభిప్రాయాలు తెలిపి మనకు సంఘీభావం తెలిపిన ప్రతి పార్టీకి, ఆయా పార్టీల నేతలకు వైఎస్సార్‌సీపీ తరఫున కృతజ్ఞతలు. మీడియా సంస్థల నుంచి వచ్చిన జర్నలిస్టులు ఏపీలో జరుగుతున్న దమనకాండ గురించి తెలుసుకున్నారు కాబట్టి, ఆ హేయమైన పనుల మీద గళం విప్పాలని విన్నవిస్తున్నా. జర్నలిస్టులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment