గుంటూరు, సాక్షి: భవిష్యత్ కార్యచరణతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ తరఫున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
వాస్తవానికి జగన్ రెండ్రోజుల పులివెందుల పర్యటన తర్వాత ఈ సమావేశం నిర్వహించాలని పార్టీ భావించింది. అయితే ఈలోపే 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. పులివెందుల పర్యటన వాయిదా వేసుకున్న వైఎస్ జగన్ పార్టీ సమావేశాన్ని 20నే నిర్వహించాలని నిర్ణయించారు.
తాడేపల్లిలోని తన కార్యాలయంలో రేపు జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేస్తారని సదరు ప్రకటన తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment