వెలిగొండ ప్రాజెక్టుపై ఎందుకంత నిర్లక్ష్యం?: వైఎస్‌ జగన్‌ | YS Jagan demand for Chandrababu Govt On Veligonda Project | Sakshi
Sakshi News home page

వెలిగొండ ప్రాజెక్టుపై ఎందుకంత నిర్లక్ష్యం?: వైఎస్‌ జగన్‌

Published Tue, Aug 20 2024 5:29 AM | Last Updated on Tue, Aug 20 2024 5:29 AM

YS Jagan demand for Chandrababu Govt On Veligonda Project

అవరోధాలను అధిగమించి టన్నెల్‌–1, టన్నెల్‌–2ను విజయవంతంగా మేమే పూర్తి చేశాం

ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాం

చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితుల పునరావాసాన్ని పట్టించుకోవడం లేదు

అమాంతంగా పనుల అంచనాలు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం 

మీదే ఆయన యావ.. తక్షణమే నిర్వాసితుల పునరావాసానికి రూ. 1,200 కోట్లు ఇవ్వండి

కరువు నేలకు అందాల్సిన కృష్ణా జలాలు కడలి పాలవుతున్నాయి

ఈ సీజన్‌లో వెలిగొండను నింపండి

కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు సాగు, తాగునీటిని అందించండి

‘ఎక్స్‌’ వేదికగా చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్‌ జగన్‌ డిమాండ్‌

సాక్షి, అమరావతి: కరవుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో రెండు టన్నెళ్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని గుర్తు చేశారు. 

కోవిడ్‌ మహమ్మారి సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి 2021లో టన్నెల్‌–1, జనవరి 2024లో టన్నెల్‌–2 నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేశామని వివరించారు. తద్వారా 2005లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైఎస్సార్‌ కలలను సాకారం చేశామన్నారు. ఇంకా నిర్వాసితులకు పునరావాసం (ఆర్‌ అండ్‌ ఆర్‌) కల్పనను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

ఈ సీజన్‌లోనే ఆర్‌ అండ్‌ ఆర్‌కు కావాల్సిన సుమారు రూ. 1,200 కోట్లు చెల్లిస్తే.. ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయవచ్చునన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశామని గుర్తుచేశారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా నిర్వాసితులకు పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్‌ జగన్‌ సోమవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.  

అంచనాలు పెంచడంపైనే యావ..
గతంలోనూ, 2014–19 మధ్య కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని వైఎస్‌ జగన్‌ విమ­ర్శించారు. అమాంతంగా పనుల (సివిల్‌ వర్క్స్‌) అంచనాలు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద చంద్రబాబుకు ఉన్న యావ.. నిర్వాసితులను ఆదుకోవ­డంలో ఎప్పుడూ కనిపించలేదన్నారు. గండికోటకు సంబంధించి కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తి చేసి.. నీళ్లు నింపడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చూపారని చెప్పారు. 

వెలిగొండ ప్రాజెక్ట్‌ రెండవ సొరంగ మార్గం 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే నిర్వాసితులకు చెల్లింపులు 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు సుమారు రూ. 1,000 కోట్లు చెల్లించి, పునరావాసం కల్పించి.. పూర్తిస్థాయిలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని గుర్తుచేశారు. అలాగే చిత్రావతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద రూ. 250 కోట్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించి పూర్తిస్థాయిలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని వివరించారు.

 బ్రహ్మంసాగర్‌కు కూడా రూ. 60 కోట్ల ఖర్చుతో డయాఫ్రం వాల్‌ పూర్తి చేసి, శ్రీశైలం నుంచి తెలుగుగంగ కెనాల్‌ లైనింగ్‌ కూడా పూర్తి చేసి, 17వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లగలిగామని.. తద్వారా బ్రహ్మంసాగర్‌లో 17 టీఎంసీల పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయగలిగామని గుర్తు చేశారు. ఎప్పుడో పూర్తయిన పులిచింతల ప్రాజెక్టు ఆర్‌ అండ్‌ ఆర్‌ను కూడా చంద్రబాబు అప్పట్లో పట్టించుకోలేదని.. దాని కోసం కూడా రూ. 140 కోట్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఖర్చు చేసి పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేసి, కృష్ణా డెల్టా రైతులకు ప్రయోజనం చేకూర్చామని వివరించారు.

ఈ సీజన్‌లోనే నల్లమల సాగర్‌ను నింపండి..
ప్రస్తుతం కరువు నేలకు అందాల్సిన కృష్ణా వరద జలాలన్నీ కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కడలిపాలు అవుతున్నాయని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగొండ ఆర్‌ అండ్‌ ఆర్‌ అంశంపై దృష్టి పెట్టాలని.. వెంటనే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని.. ఈ సీజన్‌లోనే వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల­సాగర్‌ను కృష్ణా జలాలతో నింపి ప్రకాశం జిల్లాకు సాగు, తాగునీటిని అందించాలని చంద్రబాబును వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement