ప్రజారోగ్యానికి ఉరితాడు.. చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం | YS Jagan Fires On Chandrababu Govt about Public Health | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యానికి ఉరితాడు.. చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Published Wed, Aug 28 2024 4:26 AM | Last Updated on Wed, Aug 28 2024 12:56 PM

YS Jagan Fires On Chandrababu Govt about Public Health

పీపీపీపీ మోడల్‌ అంటూ సామాన్యులకు నాణ్యమైన వైద్యం దూరం

‘ఎక్స్‌’ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

ప్రజారోగ్యం పటిష్టం కోసం వైఎస్సార్‌సీపీ హయాంలో విప్లవాత్మక సంస్కరణలు 

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికో మెడికల్‌ కాలేజీ చొప్పున రూ.8,480 కోట్లతో 17 ప్రభుత్వ కాలేజీలకు శ్రీకారం

2023–24లోనే 5 మెడికల్‌ కాలేజీలు ప్రారంభం.. 750 సీట్లు అందుబాటులోకి..

ఈ ఏడాది మరో 5 ప్రారంభం కావాల్సి ఉన్నా చంద్రబాబు వైఖరి కారణంగా గ్రహణం 

కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో పొత్తులో ఉన్నా ఐదు కాలేజీలకు అనుమతులు తెచ్చుకోలేక పోవడం మీ వైఫల్యం కాదా బాబూ?

కొత్త మెడికల్‌ కాలేజీల్లో అన్ని సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తామన్న హామీని గాలికొదిలేశారు

కేంద్రంలో పలుకుబడిని వాడుకుని ఐదు మెడికల్‌ కాలేజీలకు అనుమతులు తేవాలని సూచన

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి సీఎం చంద్రబాబు సర్కారు ఉరితాడు బిగిస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామా­న్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందంటూ ‘ఎక్స్‌’ వేదికగా మండిపడ్డారు. ‘ఇప్పటికే స్పెష­లిస్టు వైద్యులు  సహా సిబ్బంది నియామకాలను నిలి­పివేసి జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నీరు­గారుస్తున్నారు. 

ప్రజలు వైద్యం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తెస్తున్నారు’ అంటూ చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతూ మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్‌ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా మీరు నిర్లక్ష్యం చేయడం దీనికి మరో సాక్ష్యంగా నిలుస్తోంది.  ఈ ఏడాది ఆ కాలే­జీల్లో తరగతులు ప్రారంభంకాకపోవడం మీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం’ అని చంద్ర­బాబుపై ధ్వజమెత్తారు. ట్వీట్‌లో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే...

విప్లవాత్మక సంస్కరణలతో పటిష్టం చేశాం..
వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు పలు విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం. దీంట్లో భాగంగా విలేజ్‌–వార్డు క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, మండలానికి 2 పీహెచ్‌సీలు, 108, 104 సర్వీసులు గణనీయంగా పెంపు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 ప్రొసీజర్లు, కోలుకునే సమయంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య ఆసరా, ప్రతి ఇంటిని జల్లెడపడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా చేపట్టాం. రూ.16,880 కోట్లతో ఆస్పత్రుల్లో నాడు–నేడు, కొత్త మెడికల్‌ కాలేజీల పనులు చేపట్టాం. ఇవన్నీ చివరిదశకు వచ్చాయి. ప్రతి పార్లమెంట్‌  నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున మొత్తం 17 కొత్తగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి రూ.8,480 కోట్లతో శ్రీకారం చుట్టాం.

ఇది మీ వైఫల్యం కాదా? 
పటిష్ట ప్రణాళిక వల్ల 2023–24లో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. దీని­ద్వారా పేద విద్యా­ర్థు­లకు ఎంతో మేలు జరిగింది. ఈ క్రమంలో 2024–25 విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కా­పురం, మదన­పల్లె, పులివెందుల, ఆదోని కొత్త కాలేజీల్లో తరగ­తులు ప్రారంభం కావాల్సి ఉంది. 

అన్ని వసతు­లున్నా మీ వైఖరి కారణంగా వీటికి గ్రహణం పట్టింది చంద్రబాబూ..! కేంద్ర ప్రభుత్వా­న్ని నడుపు­తున్న బీజేపీతో పొత్తులో ఉన్నా మీరు అనుమ­తులు తెచ్చు­కోలేకపోయారు. ఇది మీ వైఫ­ల్యం­కాదా? ఫలితంగా మరో 750 సీట్లు అందుబా­టు­లోకి రాకుండాపోయాయి. దీంతోపాటు కొత్త కాలే­జీల్లో  మెడికల్‌ సీట్లన్నింటినీ కూడా కన్వీనర్‌ కోటా­లో భర్తీచేస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా గాలికొదిలేశారు.  

ప్రైవేట్‌ జపంతో సామాన్యుల నెత్తిన భారం..
మెడికల్‌ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేసి సామాన్యుల నెత్తిన భారం మోపే విధానాల్లోకి వెళ్తున్నారు. పీపీపీపీ మోడల్‌ అంటూ ప్రైవేటు కోసం, ప్రైవేటు కొరకు, ప్రైవేటు చేత, ప్రైవేటు వల్ల నడుపుతున్న వ్యవస్థలా ప్రజారోగ్య రంగాన్ని మార్చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులోలేని పరిస్థితి తెస్తున్నారు. ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోండి. ప్రైవేటు సంస్థలకు పోటీగా ప్రభుత్వ రంగం ఉన్నప్పుడే రేట్లు అదుపులో ఉంటాయి. 

వెంటనే స్పందించి ఈ సంవత్సరం ఆ 5 కొత్త మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తు­న్నాం. మేం శరవేగంగా నిర్మించిన కాలేజీలకు మిగిలిన ఆ సొమ్మును కూడా విడుదల చేసి ఈ సంవ­త్సరం కొన్ని, వచ్చే సంవత్సరం మిగిలిన అన్నీ పూర్తిచేసే దిశగా అడుగులు వేయండి. మీ మద్ద­తు­పైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నందున ఆ పలుకుబడిని వాడుకుని ఆ ఐదు మెడికల్‌ కాలేజీలకు వెంటనే అనుమతులు సాధించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement