ఏపీ అసెంబ్లీ గేటు వద్ద వైఎస్సార్‌సీపీ సభ్యులను అడ్డుకుంటున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్ జగన్
హత్యా రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దారుణం
దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి
హత్యాకాండపై అసెంబ్లీలో నిరసన గళం వినిపించిన ప్రతిపక్షం
నల్ల కండువాలతో ఉభయ సభల సమావేశానికి హాజరైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు హత్యా రాజకీయాలపై శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నిగ్గదీసింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సోమవారం అసెంబ్లీ వేదిక నిరసన గళం విప్పింది. ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తింది. దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలు నశించాలని ఎలుగెత్తింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాత్మక ఘటనలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణ వైఫల్యానికి నిరసనగా మెడలో నల్ల కండువాలు ధరించి ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ మూకల హింసకు నిరసనగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీగా ఉదయం అసెంబ్లీలోకి ప్రవేశించారు.
హత్యా రాజకీయాలకు నిరసనగా వాకౌట్
ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్న క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి స్థానాల్లో నిలుచుని ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరి నిరసనల మధ్యనే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. పోడియం ముందు ఫ్లోర్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ హత్యా రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.
నల్ల కండువాలు ధరించి వైఎస్సార్‌సీపీ సభ్యులతో కలిసి అసెంబ్లీకి ర్యాలీగా వస్తున్న వైఎస్ జగన్
రెడ్ బుక్‌దే రాజ్యం..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శించిన ప్లకార్డులు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులకు అద్దం పట్టాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతలు, హత్యలు, అత్యాచారాలు, వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తుల విధ్వంసం తదితర హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఫోటోలను ప్లకార్డుల్లో ప్రదర్శించారు. వినుకొండలో నడి రోడ్డుమీద వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీకి చెందిన జిలానీ కిరాతకంగా హత్య చేసిన ఘటనకు సీఎం చంద్రబాబుదే బాధ్యతని ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగం కనిపించడం లేదని, రెడ్ బుక్ రాజ్యమేలుతోందని నినదించారు.
వైఎస్సార్‌సీపీ సభ్యులతో కలిసి సభ నుంచి వాకౌట్ చేసి వెళుతున్న జగన్
పోలీసుల అతిపై వైఎస్ జగన్ ఆగ్రహం
వైఎస్సార్‌సీపీ సభ్యుల చేతిలోని ప్లకార్డులు చించివేయడంపై ఫైర్
శాసనసభ గేటు వద్ద సోమవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకుని పోలీసులు ప్లకార్డులు లాక్కుని చించివేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలని అడ్డుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ప్లకార్డులు లాక్కుని చించేసే అధికారం ఎవరు ఇచ్చారు? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, శాంతి భద్రతలు మచ్చుకైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. చట్టప్రకారం పని చేసి శాంతి భద్రతలను పరిరక్షించాలని పోలీసులకు సూచించారు.
వైఎస్సార్‌సీపీ సభ్యుల చేతిలోని ప్ల కార్డులు లాక్కుని చించివేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న వైఎస్ జగన్
పోలీసుల జులుం ఎల్లకాలం చెల్లబోదని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ‘మీ టోపీపై మూడు సింహాలు ఉన్నది అధికారంలో ఉన్న వారికి సెల్యూట్ కొట్టడానికి కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి..’ అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ప్లకార్డులు లాక్కుని చించి వేసిన పోలీసు అధికారినుద్దేశించి పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఇంతలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయం ఆసన్నమవడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులను అసెంబ్లీ ప్రాంగణంలోకి పోలీసులు అనుమతించారు. చివరిలో వైఎస్ జగన్ అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగిస్తున్న హత్యా రాజకీయాలు, అరాచకపాలన, దారుణకాండను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులతో కలిసి మెడలో నల్లకండువా ధరించి అసెంబ్లీ వరకూ వైఎస్ జగన్ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను వినుకొండలో నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్త హత్య చేసిన ఫోటోలతోపాటు రాష్ట్రంలో టీడీపీ కూటమి అరాచకాలను ప్రతిబింబించే ఫోటోలతో ప్లకార్డులను ప్రదర్శించారు. ‘సేవ్ డెమోక్రసీ.. హత్యా రాజకీయాలు నశించాలి.. వియ్ వాంట్ జస్టిస్’ అని నినాదాలు చేస్తూ ర్యాలీగా అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు.
వైఎస్సార్‌సీపీ గొంతు నొక్కే ప్రయత్నం
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలమయ్యాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రోజుకోహత్య, అత్యాచారం జరుగుతున్నాయి. చంద్రబాబు పథకాలు అమలు చేయలేకే.. ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలతో కలసి పోరాటం చేస్తాం.
– వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ
హోం మంత్రి అనిత ఏంచేస్తున్నారు?
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారు. ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఎనిమిదేళ్ల చిన్నారిని రేప్‌చేసి చంపితే.. హోంమంత్రిగా ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత లేదా? దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కనీసం స్పందించకపోవడం బాధాకరం.
– తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ
బ్లడ్‌గేమ్ ఆడుతున్న చంద్రబాబు
శాంతిభద్రతల గురించి మాట్లాడితే హోం మంత్రి అనిత లాఠీలు, గన్నులు పట్టుకుని తిరగాలా? అని అడుగుతున్నారు. అలా తిరగాల్సిన పనిలేదు. అవి పట్టుకుని తిరుగుతున్న పోలీసులకు స్వేచ్ఛనిచ్చి, వారిపని వారు చేసుకునే అవకాశం ఇవ్వాలి.
చంద్రబాబు బ్లడ్‌గేమ్ ఆడుతున్నారు.
– డి.సి.గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ
గవర్నర్ స్పందించకపోతే ఎలా?
కూటమి పాలనలో హత్యలు, హత్యాయత్నాలు, దాడుల గురించి ఆదివారం గవర్నర్‌కు వైఎస్ జగన్ వివరించారు. కానీ అసెంబ్లీ ప్రసంగంలో గవర్నర్ కనీసం ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు. గవర్నర్ స్పందించకపోతే ఎలా? ఇంకెవరికి చెప్పుకోవాలి.
– చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్సీ
రాష్ట్రంలో అరాచక, ఆటవికపాలన
వైఎస్సార్‌సీపీని అణగదొక్కడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ నెల రోజుల పాలనలో అదే జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఎన్నికల తరవాత అంతులేని దారుణాలు జరిగాయి. కేంద్ర సంస్థలతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి.
– బొమ్మి ఇజ్రాయేల్, ఎమ్మెల్సీ
శాంతిస్థాపనకు గవర్నర్ చొరవ చూపాలి
గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్ సత్వరమే జోక్యం చేసుకుని రాష్ట్రంలో అరాచకాలను అంతమొందించాలి. తక్షణమే శాంతి స్థాపనకు చొరవ చూపాలి. లేకపోతే రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, ఓటు వేసినవారు జీవించలేని పరిస్థితి నెలకొంటుంది.
– మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ
ఓటు వేయని వారే లక్ష్యంగా దాడులు
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆ వెంటనే.. ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను వేధించడమే పనిగా పెట్టుకుంది. గవర్నర్, ప్రధాని, కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకుని వీటిని ఆపాలి.
– పోతుల సునీత, ఎమ్మెల్సీ
ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు, దౌర్జన్యాలు
లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే కేవలం మా పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, ఆస్తులు, వ్యాపార సంస్థలపై మాత్రమే కాకుండా.. చివరకు ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి.
– సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ
రక్షణ లేకుండా పోయింది
వైఎస్సార్‌సీపీ తరఫున పార్లమెంటు, శాసనసభలకు ఎన్నికైనవారికి, పోటీచేసిన వారికి రక్షణ లేకుండా పోయింది. పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డెప్పని పరామర్శించడానికి వెళ్లిన మా పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నం చేశాయి.
– సానేపల్లి మంగమ్మ, ఎమ్మెల్సీ
మంత్రులకు బుర్ర పనిచేయడంలేదు
నెలన్నర కాలంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దాడులు, ఆస్తుల ధ్వంసం, హత్యలు, మానభంగాలు, లాకప్‌డెత్‌లు, ఆత్మహత్యలు తప్ప ఏమీ కనిపించడంలేదు. అసమర్థ పాలన వల్ల ప్రజల్లో అప్పుడే చెడ్డపేరు మూటగట్టుకున్నారు. అందుకే మంత్రులంతా మతితప్పి మాట్లాడుతున్నారు. మంత్రులకు బుర్ర పనిచేయటం లేదు.
– దాసరి సుధ, ఎమ్మెల్యే
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు
రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కనిపించడం లేదు. రాజ్యాంగం, చట్టం, పోలీసువ్యవస్థ.. అన్నీ నిర్వీర్యమయ్యాయి. రెడ్ బుక్ రాజ్యాంగం 45 రోజులుగా ఇక్కడ పనిచేస్తోంది.
– బి.విరూపాక్షి, ఎమ్మెల్యే
యంత్రాంగాన్ని రాజకీయమయం చేశారు
వివక్ష లేకుండా ప్రజలందరి ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాల్సింది పోయి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయమయం చేశారు. హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు.
– మత్స్యరస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే
పథకం ప్రకారం చేస్తున్న దుర్మార్గాలు
రాష్ట్రంలో నెలన్నర రోజులుగా పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీని అణగదొక్కడానికి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఉండకూడదన్న లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారు. వాటిని అడ్డుకోవద్దని అధికారులను నిర్దేశించారు. దీంతో టీడీపీ గూండాలు రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు.
– రేగం మత్స్యలింగం, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment