టీడీపీ దాడులపై మరోసారి వైఎస్ జగన్ ఫైర్
పథకం ప్రకారమే నవాబ్‌పేట్ దాడి ఘటన: వైఎస్ జగన్
హామీలను పక్కన పెట్టి చంద్రబాబు దాడుల్ని ప్రొత్సహిస్తున్నారు
చంద్రబాబు పాలనపై జెట్ స్పీడ్‌తో వ్యతిరేకత
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి
అరాచక పరిస్థితులపై గవర్నర్ దృష్టి సారించాలి
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదు?
నంద్యాల ఘటనను ఖండించిన జగన్.. బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయం
ఎన్టీఆర్, సాక్షి: కేవలం ఆధిపత్యం చాటడం కోసం ఒక పథకం ప్రకారం నవాబ్‌పేట్ దాడి ఘటన జరిగిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలిద్దరినీ మంగళవారం సాయంత్రం విజయవాడ ఆస్పత్రిలో జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘నవాబ్‌పేటలో ప్లన్ ప్రకారమే కర్రలతో కొట్టారు. సుమారు 20 మంది కలిసి దాడి చేశారు. ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు?. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకుంటూ వచ్చాడు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. చివరకు.. మహిళలు, చిన్నారులపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నా.. దాడులు ఆపాలి. మీరు చేసే ఈ కిరాతకాలు, దారుణాల వల్ల ప్రజలేమైనా భయపడతారనుకుంటున్నారా? ఎవరూ భయపడరు. ఇంకా కోపంగా మారుతారు. అలా మారి, చంద్రబాబుగారిని, తెలుగుదేశం పార్టీ.. రెండింటినీ బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులకు దారి తీస్తాయి.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఏర్పడటానికి కాస్తో కూస్తో టైం పడుతుంది. కానీ, చంద్రబాబు మీద వ్యతిరేకత చాలా వేగంగా పెరిగిపోతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాలన మీద దృష్టి పెట్టడం లేదు. మేనిఫెస్టోలో హామీల్ని నెరవేర్చడం లేదు. దాడుల్ని ప్రొత్సహిస్తున్నారు. స్కూళ్లు, ఆస్పత్రుల్ని నిర్వీర్యం చేస్తున్నారు.
అందరినీ మోసం చేశారు
రైతులకు పెట్టుబడి సాయం చేస్తానని మోసం చేశారు. ప్రతి సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు. మండల విద్యాధికారులు ఉన్నారు. అయినా కూడా తల్లులను మోసం చేస్తూ, వారికి ఇస్తానన్నది ఎగ్గొట్టేశాడు. ప్రతి పిల్లాడిని చూపి నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీకు 15 వేలు ఇస్తామని చెప్పి, ప్రతి పిల్లాడిని మోసం చేశాడు. ప్రతి అక్కచెల్లెమ్మనూ మోసం చేశాడు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి, వాళ్లనూ మోసం చేశాడు. ఈరోజు ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకుంటున్న పిల్లలు.. జనవరి, ఫిబ్రవరి, మార్చి.. క్వార్టర్ ఫీజులు రాలేదు. ఏప్రిల్, మే, జూన్.. రెండో త్రైమాసిక ఫీజులు కూడా రాలేదు. పిల్లలు చదువుకోలని పరిస్థితి, వారు ఫీజులు కట్టలేని పరిస్థితి, కాలేజీల యాజమాన్యాలు ఫీజులు అడుగున్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. పిల్లలకు వసతి దీవెన ఎగ్గొట్టేశారు. అక్క చెల్లెమ్మలకు రావాల్సిన సున్నా వడ్డీ.. అది కూడా ఎగ్గొట్టేశాడు. పిల్లలను, అక్కాచెల్లెమ్మలను, తల్లులను.. ఇలా అందరినీ మోసం చేస్తున్నారు. పిల్లలు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఇవేవీ జాప్యం కాలేదు.
ప్రజలంతా అడుగుతున్నారు
ఇవన్నీ కూడా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా, క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తూ వచ్చిన పరిస్థితి. అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, మత్స్యకార భరోసా అయితేనేమి.. ఇవన్నీ కూడా మాకెందుకు ఇవ్వలేదని ప్రజలంతా అడుగుతున్నారు.
రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదు
రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి భయానక పరిస్థితి కల్పిస్తున్నారు. ఈ అరాచకాలను రాజకీయ పక్షాలకు వివరించాం. జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. అరాచక పరిస్థితులపై గవర్నర్ దృష్టి పెట్టాలి. చూసీ చూడనట్లు వదిలేయకుండా జోక్యం చేసుకోవాలి. పరిస్థితి చక్కదిద్దడంలో చొరవ చూపాలి. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయమైన ఘటనలు, ఇక్కడి పరిస్థితిని అన్ని రాజకీయ పార్టీలకు వివరించాం. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాలు, అఘాయిత్యాలను చూసి, ఎందుకు రాష్ట్రపతి పాలన విధించకూడదు?. ఈ విషయంలో కచ్చితంగా హైకోర్టు తలుపులు తడుతాం. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడుతాం.
భవిష్యత్తులో కష్టమే
రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయం మొదలైంది. దానికి చంద్రబాబునాయుడుగారు తెర తీశారు. ఇది మంచిది కాదు. దాడులు, హత్యలు సరికావు. వెంటనే ఇవన్నీ ఆపాలి. కక్ష సాధించి ఏం సాధిస్తారు?. ఇదే కొనసాగితే భవిష్యత్తులో అదుపు చేయడం కష్టం. ఇవాళ మీరు(చంద్రబాబును ఉద్దేశించి) అధికారంలో ఉండొచ్చు. రేపు మేం అధికారంలోకి వస్తాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అప్పుడు ఆగమన్నా మా కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు అని హెచ్చరికలు జారీ చేశారు వైఎస్ జగన్. నంద్యాలలోనూ ఈ మధ్య రాజకీయ హత్య జరిగింది. ఈ శుక్రవారం అక్కడికి వెళ్తున్నా. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తా.
Comments
Please login to add a commentAdd a comment