ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని, ప్రతీకార దాడుల నేపథ్యంలో కుంగిపోకుండా ధైర్యంగా పోరాడాలని, పార్టీ అండగా పోరాటం చేస్తుందని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం టీడీపీ గుండాల చేతిలో దాడికి గురై చికిత్స పొందుతున్న నవాబ్‌పేట(జగ్గయ్యపేట-ఎన్టీఆర్ జిల్లా) పార్టీ కార్యకర్తలను ఆయన స్వయంగా వెళ్లి పరామర్శించారు.
ఆగష్టు 3వ తేదీన వైఎస్సార్‌సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ దాడికి అడ్డుకోవడానికి వచ్చిన మరో ఇద్దరు కార్యకర్తలనూ తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్.. నేరుగా విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని వెళ్లి కలిశారు.
ఈ సందర్భంగా దాడి జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్న ఆయన.. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని, టీడీపీ నేతల దాడిలో రక్తమోడిన కార్యకర్తల చిత్రాలను చూసి చలించిపోయారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన.. దాడుల్ని వెంటనే ఆపాలంటూ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. నంద్యాలలోనూ జరిగిన రాజకీయ హత్య గురించి ప్రస్తావిస్తూ.. 9వ తేదీన బాదిత కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పారాయన.
జగన్‌కు ఘన స్వాగతం
బెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన వైఎస్ జగన్‌కు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. విజయవాడలోని సన్‌రైజ్ ఆస్పత్రికి చేరుకునే క్రమంలోనూ.. దారి పొడవునా ఆయన కోసం అభిమానులు, పార్టీ కార్యకర్తలు బారులు తీరారు. జై జగన్ నినాదాలు చేశారు. వాళ్లను నిరుత్సాహపర్చడం ఇష్టం లేక బయటకు వచ్చి ఆయన అభివాదం చేశారు. అనంతరం.. ఆస్పత్రి వద్ద కూడా ఆయన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు.
ఎయిర్‌పోర్ట్ వద్ద పోలీసుల ఓవరాక్షన్
వైఎస్ జగన్ రాక నేపథ్యంలో.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆయన్ని పోలీసులు లోపలికి అనుమతించారు.
హత్యాయత్నం చేసి ఆపై..
ఆగష్టు 3వ తేదీన జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబ్‌పేట వైఎస్సార్‌సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద రాత్రి టైంలో టిఫిన్ చేయడానికి ఆగిన ఆయనపై టీడీపీ నేతలు దాడికి దిగారు. బ్లాక్ కలర్ స్కార్పియోలో వచ్చిన టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు(బుల్లబ్బాయ్) , మరో ఐదుగురు కర్రలతో, రాడ్లతో శ్రీనివాసరావు పై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన శ్రీనివాసరావు అనుచరులు, పార్టీ కార్యకర్తలు డేరంగుల గోపి, దేవి శెట్టి రామకృష్ణ పైనా టీడీపీ గూండాలు విరుచుకుపడ్డారు. ఆపై శ్రీనివాసరావు వాహనాన్ని ధ్వంసం చేశారు. అయితే స్పృహ కోల్పోయిన ముగ్గురినీ చూసి.. చనిపోయారనుకుని అక్కడి నుంచి పారిపోయారు. కొన ఊపిరితో ఉన్న బాధితులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. దీంతో వాళ్లు ప్రాణాలు నిలిచాయి.
కొనసాగనున్న పోరాటం
టీడీపీ దాడులతో భీతిల్లుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెబుతూ వస్తున్నారు. ఆందోళన చెందవద్దని, పార్టీ తరఫున తాను ముందుండి పోరాటం చేస్తానని, మళ్లీ పార్టీకి పునర్వైభవం వస్తుందని భరోసా ఇస్తున్నారు . ఈ క్రమంలో బాధిత కుటుంబాలను కలిసి ఆయన ధైర్యం చెబుతున్నారు. ఇటీవలే పల్నాడు వినుకొండలో నడిరొడ్డు మీద అంతా చూస్తుండగా జరిగిన ఘటన అందరికీ వెన్నులో వణుకు పుట్టించింది. కేవలం వైఎస్సార్‌సీపీ కోసం పని చేశాడని రషీద్ అనే యువ కార్యకర్తను.. టీడీపీకి చెందిన జిలానీ అనే వ్యక్తి అతికిరాతకంగా చంపాడు. రషీద్ మృతిపై చలించిపోయిన వైఎస్ జగన్.. వినుకొండ వెళ్లి బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. ఆపై టీడీపీ రాక్షస పాలనను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తూ.. ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ సమయంలోనే కూటమి ఆటవిక పాలనపై పోరాటం కొనసాగుతుందని ప్రకటించారాయన.
Comments
Please login to add a commentAdd a comment