
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుకు తట్టెడు మట్టి మోయని సీఎం కేసీఆర్.. తానే జలకళ తెచ్చి నట్టు గప్పాలు కొట్టుకుంటున్నాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. కష్టం ఒకరిదైతే.. ప్రచారం మరొకరిదనే సామెత ఆయనకు సరిపోతుందని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెబుతున్న 20 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు నాడు మహానేత వైఎస్సార్ జలయజ్ఞం కింద వేసిన పునాదులేనని స్పష్టం చేశారు.
పాలమూరు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి అని చెప్పి కమీషన్లు దండుకు న్నారని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే.. పదేళ్ల పాలనలో ఒక్క ఎకరాకు అయినా అదనంగా సాగునీరు ఇచ్చారా అని ఆమె నిలదీశారు. 10 లక్షల ఎకరాలు అని చెప్పి 10 ఎకరాలు తడిపింది లేదని నిందించారు.
మహానేత హయాంలో మైగ్రేషన్ వద్దని ఇరిగేషన్ చేస్తే.. నేడు ఇరిగేషన్ పక్కన ఎట్టి మైగ్రేషన్ వైపే మళ్లేలా కేసీఆర్ పాలన సాగుతోందని ధ్వజమె త్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అయినా వలసలు ఆగలేదని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.