వైఎస్సార్‌ పాలనే లక్ష్యం | Ys Vijayamma And Ys Sharmila Comments On Ysr Telangana Party Flag Innovation | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ పాలనే లక్ష్యం

Published Fri, Jul 9 2021 5:09 AM | Last Updated on Fri, Jul 9 2021 11:21 AM

 Ys Vijayamma And Ys Sharmila Comments On Ysr Telangana Party Flag Innovation - Sakshi

తెలంగాణలో మళ్లీ వైఎస్సార్‌ సంక్షేమ పాలన తీసుకురావాలన్నదే తమ పార్టీ లక్ష్యమని వైఎస్‌ షర్మిల ప్రకటించారు. తమ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఎజెండాలో సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం ముఖ్యమైన అంశాలని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సంక్షేమ పథకాలను మళ్లీ ప్రారంభించడం ద్వారా పేదలను స్వయం సమృద్ధులను చేసి రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపడమే ధ్యేయమని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 72వ జయంతి సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్‌ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కేరింతలు, చప్పట్ల మధ్య ‘వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ’ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పేరును, ఎజెండాను షర్మిల అధికారికంగా ప్రకటించారు. వైఎస్సార్‌టీపీ జెండాను తల్లి వైఎస్‌ విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెండాలోని ముఖ్యాంశాలు వివరించేలా సాగిన లేజర్‌ షో ఆకట్టుకుంది. సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే వేదిక పక్కన ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహానికి షర్మిల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మిల

ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..వైఎస్సార్‌ స్ఫూర్తితో సమానావకాశాలు

‘రుణమాఫీ, ఉచిత విద్యుత్, పావలావడ్డీ, ఆరోగ్యశ్రీ, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే దార్శనికత వైఎస్సార్‌ది. 2004–09 మధ్యలో లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు 11 లక్షలకు పైగా ప్రైవేట్‌ ఉద్యోగాల కల్పించిన మహానేత వైఎస్సార్‌. కుల, మతాలకు అతీతంగా, ఆడ..మగ తేడా లేకుండా వైఎస్సార్‌ ప్రజలందరినీ సమానంగా చూశారు. మేము కూడా అదే స్ఫూర్తితో అందరికీ సమాన అవకా శాలు కల్పించేలా కృషి చేస్తాం. అసెంబ్లీ సహా ఎంపీ స్థానాల్లో మహిళలకు 50% సీట్లు కేటాయిస్తాం. చట్టసభల్లో 50% మహిళలను కూర్చోబెట్టాలనేది మా పార్టీ లక్ష్యం. రాష్ట్ర జనాభాలో 52 శాతమున్న బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన పాలనలో సరైన భాగస్వామ్యం కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు మినహాయించి మిగతా సీట్లలో జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనారిటీలకు రక్షణ కవచంగా నిలిచి ఆయా వర్గాల అభివృద్ధికి కృషిచేస్తాం. ఈ రోజు నుంచి వంద రోజుల్లోగా తెలంగాణలో పాదయాత్ర చేపడతా.

కేసీఆర్‌ ఏం జవాబు చెబుతారు?


సంక్షేమంలో నంబర్‌ 1 అని చెప్పుకునే కేసీఆర్‌ కరోనాతో అప్పుల పాలైన పేదల కుటుంబాలకు ఏమని సమాధానం చెబుతారు? ఆరేళ్లలో 6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు ఏం జవాబిస్తారు? కేసీఆర్‌ సంక్షేమం అంటే గారడీ మాటలు, గొప్పలు, చేతికి చిప్పలే. ఉపాధి లేక, ఉద్యోగాలు లేక వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా, తమ కుటుంబానికి నాలుగు ఉద్యోగాలు వచ్చాయి చాలంటూ.. ఇంటికో ఉద్యోగం హామీని కేసీఆర్‌ మరిచిపోయారు. రాష్ట్రం ఏర్పడ్డాక రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారు. 

ప్రాజెక్టులపై ఇప్పుడు నిద్ర లేచారా?
కృష్ణా నదిపై రెండేళ్ల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే సీఎం కేసీఆర్‌ ఇప్పుడే నిద్రలేచారా? ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించుకున్నారు కదా. రెండు నిమిషాలు నీటి పంచాయతీపై మాట్లాడుకోలేరా? రెండు రాష్ట్రాల సీఎం లతో చర్చించి పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా? తెలంగాణకు సంబంధించిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదులుకోం. పక్క రాష్ట్రానికి కూడా నష్టం జరగనివ్వం. తెలంగాణలో ఇంకా కాంగ్రెస్‌ నిలబడి ఉందంటే దానికి కారణం వైఎస్సారే. అలాంటి వైఎస్సార్‌ను టీఆర్‌ఎస్‌ నాయకులు దూషిస్తుంటే కాంగ్రెస్‌ నేతలు చేతులు ముడుచుకుని చేతగాని వాళ్లలా కూర్చున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై ఆధారాలున్నాయంటున్న బీజేపీ అధ్యక్షుడు, ఎందుకు బయటపెట్టడం లేదు? కేసులెందుకు పెట్టడం లేదు? టీఆర్‌ఎస్, బీజేపీ తోడు దొంగలే..’ అని షర్మిల విమర్శించారు.

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు
వైఎస్సార్‌ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద షర్మిల ఘనంగా నివాళులర్పించారు. తండ్రి సమాధిపై పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ విజయమ్మ, బ్రదర్‌ అనిల్‌కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి పాల్గొన్నారు. 

నాయకుడంటే వైఎస్సారే : విజయమ్మ


తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దివంగత నేత వైఎస్సార్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. నాయకుడు అంటే దానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్సార్‌ అని పేర్కొన్నారు. వైఎస్సార్‌ను చూసి నేర్చుకోవాలని, ఆయనది నిండైన వ్యక్తిత్వమని చెప్పారు. నాయకుడంటే నమ్మకం, భరోసా, ఆప్యాయత, ఆత్మీయతకు చిహ్నమని అన్నారు. తెలుగువారి గుండెచప్పుడు వైఎస్‌ అని, ఆయనను ఇక్కడి ప్రజలు అమితంగా ప్రేమించారని గుర్తుచేశారు. తెలం గాణను స్వర్ణమయం, సస్యశ్యామలం చేయాలన్నది వైఎస్‌ కల అని తెలిపారు.

ఇది దైవ నిర్ణయం
వైఎస్‌ విశ్వసనీయతను, ఆత్మీయత, హావభావాలను జగన్, షర్మిల పుణికి పుచ్చుకున్నారని విజయమ్మ చెప్పారు. వైఎస్‌ చిత్తశుద్ధికి, పట్టుదలకు వారు వారసులు అని అన్నారు. వారిప్పుడు వేర్వేరు రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రతినిధులని పేర్కొన్నారు. ఇది దైవ నిర్ణయమని, ప్రజాహితం కోసం జరి గిన నిర్ణయమని అన్నారు. ‘వైఎస్సార్‌ బిడ్డలు దొంగలు, గజదొంగలు కాదు. మాటకు ప్రాణమిచ్చే వారు. దాచుకోవడం, దోచుకోవడం తెలియదు. పంచడం మాత్రమే తెలుసు..’అని చెప్పారు. షర్మిలను తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకుని ఆశీర్వదించాలని విజయమ్మ కోరా రు. ఈ సభలో పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్‌ ప్రసంగించారు. బ్రదర్‌ అనిల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

షర్మిల పార్టీకి ఆల్‌ ద బెస్ట్‌: కోమటిరెడ్డి
జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద నుంచి వెళ్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడ ఆగి వైఎస్సార్‌ అభిమానులతో ముచ్చటించారు. వైఎస్‌ గొప్ప నేత అని కొనియాడారు. అలాంటి నేత ఇంతకుముందు లేడు, ఇక రాడు అని అన్నారు. షర్మిల పార్టీకి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. కాగా, వైఎస్‌ షర్మిల పార్టీకి స్వాగతం చెబుతున్నట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement