‘బాబూ.. నీ 40 ఏళ్ల రాజనాల విలనిజం ప్రజలకు అర్థమైంది’ | YSRCP Leader Pothina Mahesh Satirical Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘బాబూ.. నీ 40 ఏళ్ల రాజనాల విలనిజం ప్రజలకు అర్థమైంది’

Published Mon, Sep 9 2024 7:57 PM | Last Updated on Mon, Sep 9 2024 8:03 PM

YSRCP Leader Pothina Mahesh Satirical Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. నువ్వు ఎన్ని కథలు చెప్పినా, ఎల్లో మీడియాలో ఎలివేషన్‌ ఇచ్చినా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌. చంద్రబాబు మాట​లు చూస్తుంటే ఆయనకు చాదస్తం ఎక్కువైంది అనుపిస్తుందని ఎద్దేవా చేశారు.

కాగా, పోతిన మహేష్‌ ట్విట్టర్‌ వేదికగా..‘వరదొచ్చినా బురదొచ్చినా ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి వచ్చినా కారణం వైఎస్‌ జగన్‌ అనే చంద్రబాబు మాట్లాడేలా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక బాబుకు చాదస్తం ఎక్కువైంది అనిపిస్తోంది. కురుస్తున్న వర్షాలు తెలుసు, కట్టెలు తెంచుకుంటున్న కృష్ణా నది తెలుసు అయినా సరే విజయవాడ మునిగే వరకు అసలు ఏయే వాగులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియలేదు ప్రభుత్వానికి.

వరదకు ముందు చేయాల్సిన పనులు చేయక, ముంపు ముంచుకొచ్చాక, ప్రజలు నీట మునిగాక చిర్రెత్తిన ప్రజలని శాంతి పరచడానికి ఆయన రోడ్ల మీద బోటుల్లో తిరుగుతున్నారు తప్ప అసలు ఆ బోట్లు రోడ్డు మీదకు రాకుండా ఆపలేకపోయినా తన చేతకానితనాన్ని తెలివిగా కప్పిపుచ్చుకుందాం అనుకున్నారు కూటమి నేతలు.

ఎన్ని కథలు చెప్పినా, సొంత మీడియా వాడుకుని ఎలివేషన్స్‌ ఇచ్చినా ప్రజల కోపం తగ్గలేదు కాబట్టి  గొల్లపూడి బోట్లు వైఎస్సార్‌సీపీ వాళ్ళవి అంటూ కొత్త కుట్ర ఎత్తుకున్నారు. 10 లక్షల క్యూసెక్కులపైగా వరద ప్రవాహాన్ని ఐదు బోట్లు అడ్డుకోగలవా?. ఎవ్వరైనా బోట్లకి పార్టీ రంగులేసుకుని ప్రకాశం బ్యారేజ్ గేట్లకి అడ్డంగా వదిలేయాలనుకుంటారా?. ఇలాంటి 40ఏళ్ల క్రితం రాజనాల సినిమా విలనిజం చేస్తే అర్ధం చేసుకునే తెలివి జనానికి లేదా?.

అసలు మత్యకారులకు, బోట్ నిర్వాహకులకు ప్రభుత్వం సరైన సమాచారం ఇచ్చి వాళ్లని అప్రమత్తం చేస్తే ఈ రోజు బోట్లు కొట్టుకువచ్చే పరిస్థితి వచ్చేది కాదు కదా. బుడమేరు వాగును, దానికి వస్తున్న ఇన్‌ఫ్లోని ముందే అంచనా వేస్తే ఈ రోజు నాలుగు లక్షల మంది ప్రజల జీవితాలు ఛిద్రం కాకుండా ఉండేవి. అలాగే గొడుగు పట్టుకుని బుడమేరు కట్ట దగ్గర రీల్స్ చేసుకునే పరిస్థితి నిమ్మల రామానాయుడుకి రాకుండా ఉండేది. క్రైసిస్ మేనేజ్‌మెంట్‌లో నన్ను మించిన వారు లేరని మీ మీడియాలో ఊదర గొట్టే ముందు బుడమేరు వరదలకు కారణం మీరే అని ఎప్పుడు గ్రహిస్తారు?.

ఏదో రకంగా వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టాలని వరదల్లో బురద ముంపులో మురికి రాజకీయం చేయాలని టీడీపీ పార్టీ నాయకులు తాపత్రయం పడుతున్నారు తప్ప అసలు ఈ ముంపుకి కారణం మాత్రం ప్రజలకు అర్ధం అయ్యింది. కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే వ్యక్తులను పోలీసులు తీసుకెళ్లి విచారణ పేరుతో వేధిస్తున్నారు. కోమటి రామ్మోహన్ తనకున్న బోట్లను నాలుగేళ్ల క్రితమే ఉషాద్రి అనే వ్యక్తికి విక్రయించారు. ఉషాద్రికి ఏ పార్టీతో సంబంధం లేకున్నా వైఎస్సార్‌సీపీ పార్టీ చెందినవారు అని చెప్పాలని పోలీసులు ఒత్తిడి తీసుకొస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి చట్టవిరుద్ధంగా నడుచుకుంటే సంబంధిత పోలీసు అధికారులు కోర్టు ముందు నిలబెడతామని న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేస్తుంది అంటూ కామెంట్స్‌ చేశారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement