‘దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లతో పదవులా?’ | YSRCP Leader TJR Sudhakar Babu Takes On TDP Government | Sakshi
Sakshi News home page

‘దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లతో పదవులా?’

Feb 4 2025 7:43 PM | Updated on Feb 4 2025 7:55 PM

YSRCP Leader TJR Sudhakar Babu Takes On TDP Government
  • మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అరాచకం
  • గుండా రాజ్యం, తాలిబన్ పాలనను తలపించాయి
  • దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్ లతో పదవులు దక్కించుకున్నారు
  • రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చారు
  • మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో దాడులు
  • పదవులు దక్కించుకునేందుకు దిగజారిన కూటమి నేతలు
  • పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు
  • ఏడాది పాటు ఉండే పదవుల కోసం ఇంత ప్రాకులాటా?
  • ప్రజాతీర్పుతో దర్జాగా పదవులను దక్కించుకునే సత్తా కూటమి పార్టీలకు లేదు
  • వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ గెలుపును ఎవరూ ఆపలేరు
  • ఈరోజు కూటమి పార్టీలు చేసిన దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు
  • మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్

తాడేపల్లి :రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్లతో అరాచాకం సృష్టించి పదవులను దక్కించుకున్నాయని వైఎస్సార్‌సీపీ(YSRCP) రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు(TJR Sudhakar Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పదవుల కోసం గుండా రాజ్యం, తాలిబన్ పాలనను తలపించేలా వ్యవహరించారని మండిపడ్డారు. కేవలం ఏడాది కాలం ఉండే పదవుల కోసం నిసిగ్గుగా రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడిచారని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల అప్రజాస్వామిక విధానాలకు పాల్పడ్డాయి. రాష్ట్రంలో మూడు కార్పోరేషన్ల డిప్యూటీ మేయర్ పదవులు, ఏడు మున్సిపాలిటీలకు సంబంధించి వైస్ చైర్ పర్సన్ ఎన్నికలను రాజకీయ వికృత క్రీడకు మార్చేశారు. అంతిమంగా అధికార దుర్వినియోగంతో తెలుగుదేశం పార్టీ దొడ్డిదోవన పదవులను దక్కించుకుంది. ప్రజాస్వామ్యంను ఖునీచేశారు. రాష్ట్రంలో మొత్తం 106 మున్సిపాలిటీలు ఉంటే వాటిల్లో 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.

 వాటిల్లో 73 మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. కేవలం దర్శి, తాడిపత్రి మున్సిపాలిటీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ప్రభాకర్ రెడ్డి గతంలో మాట్లాడుతూ వైఎస్‌ జగన్(YS Jagan)  తలుచుకుంటే తాడిపత్రి కూడా వైఎస్సార్‌సీపీ పరం అయి ఉండేదని అన్నారు. అంటే సీఎంగా ఉండి కూడా వైఎస్‌ జగన్  ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వాలని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించ కూడదంటూ చాలా స్పష్టంగా చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి విధానాలకు పూర్తి విరుద్దం. ఎలాంటి అడ్డదోవ తొక్కైనా సరే అధికారంలోకి రావాలన్నదే టీడీపీ లక్ష్యం. దానిలో భాగంగానే దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలు, కిడ్నాప్ లు, అర్ధరాత్రి దాడులు, కోరం లేకుండా చేసి ఎన్నికలను వాయిదా వేయించడం, నామినేషన్లకు వెడుతున్న వారిని అడ్డుకోవడం వంటి ఘటనలు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికల సందర్భంగా అనేకం జరిగాయి.

పలుచోట్ల కొనసాగిన అరాచకపర్వం
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ, తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్, నెల్లూరు, నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాలెం, కృష్ణాజిల్లా నూజివీడు, ఏలూరు కార్పోరేషన్లలో జరిగిన ఘటనలను రాష్ట్ర ప్రజలు అందరూ గమనించారు. కేంద్రంలోనూ భాగస్వామిగా ఉన్నారు. అధికారంలో ఉన్నామని, పోలీసులు తమ చెప్పుచేతల్లో ఉన్నారని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. అడ్డదోవలో అన్యాయంగా ఉప ఎన్నికలు నిర్వహించిన కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్లే దీనికి బాధ్యత వహించాలి. 16 మున్సిపల్ కార్పోరేషన్లలో 13 చోట్ల వైఎస్సార్‌సీపీ మేయర్లు పదవుల్లో ఉన్నారు. 

ఆనాడు పురపాలికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కట్టారు. ఏడాది తరువాత జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పును కోరి, దర్జాగా పదవుల్లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ దీనికి భిన్నంగా కూటమి పార్టీలు ఉప ఎన్నికల్లో కుట్ర, కుతంత్రలకు పాల్పడటం హేయం. పద్మభూషణ్ అవార్డును అందుకున్న నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలోని హిందూపూర్ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు ఎటువంటి అక్రమాలను ప్రోత్సహించారు. గౌరవప్రథమైన పద్మభూషణ్ అవార్డుకు ఆయన అర్హులేనా? మంత్రి కొలుసు పార్థసారధి రాత్రిపూట వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల ఇంటికి వెళ్ళి వారిని బెదిరింపులకు గురి చేశారు. 

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తునిలో చేసిన అరాచకాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తునిలో మద్యం మత్తులో మహిళా కౌన్సిలర్ పట్ల టీడీపీ నేతలు అసభ్యంగా వ్యవహరించారు.  పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో నామనేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. తిరుపతిలో ఒక్క కార్పోరేటర్ ఉన్న టీడీపీ ఏకంగా డిప్యూటీ మేయర్ గా ఎన్నిక అవ్వడం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించడం కాదా? తెలుగుదేశం తమను భయపెట్టారు, బలవంత పెట్టారంటూ వైఎస్సార్‌సీపీ తిరుపతి కార్పోరేటర్లు మా పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ని కలిసి కన్నీటితో తమ ఆవేదనను చాటుకోవడం రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. నెల్లూరులో మంత్రి నారాయణ వైఎస్సార్‌సీపీ మున్సిపల్ కౌన్సిలర్ల ఇళ్ళపై దాడులు చేయించారు. ఏలూరు కార్పోరేషన్ లో బలం లేకపోయినా డిప్యూటీ మేయర్ పదవుల కోసం అడ్డదారుల్లో ఆ పదవులను దక్కించుకున్నారు.

ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ ఎదురుచూస్తోంది. ప్రజాతీర్పుతో మళ్ళీ అధికారంలోకి రావడానికి సిద్దంగా ఉన్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రిటర్నింగ్ అధికారులు చట్టబద్దంగా, న్యాయబద్దంగా నిర్వహించాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వమే ఎల్ల కాలం అధికారంలో ఉండదు. మళ్లీ ప్రజలు మార్పును కోరుకుంటారు, వైఎస్‌ జగన్‌కి అధికారాన్ని అప్పగిస్తారు. 

ఇప్పుడు అధికారం ఉందని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ మీరు చూపుతున్న మార్గం రాబోయే రోజుల్లో మిగిలిన వారు కూడా అనుసరించే అవకాశం ఉందని గ్రహించండి. కూటమి ప్రభుత్వంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మెప్పు కోసం రాజ్యాంగానికి విరుద్దంగా, చట్టాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న ప్రతి వ్యవహారాన్ని వైఎస్సార్‌సీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. దీనికి కారకులైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకునే రోజులు వస్తాయి’ అని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement