‘ఓ పార్టీలో పప్పు.. మరో పార్టీలో కామెడీ యాక్టర్’ | YSRCP Ministers Comments On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రజా విశ్వాసం కోల్పోయింది

Published Mon, Apr 5 2021 1:39 PM | Last Updated on Mon, Apr 5 2021 1:53 PM

YSRCP Ministers Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi

సాక్షి, నెల్లూరు: ఇంటి వద్దకే సంక్షేమాన్ని చేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మంత్రులు అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో నిర్వహించిన ‘శంఖారావం’ బహిరంగ సభలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, నారాయణస్వామి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్‌ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో చేతులెత్తేయాలని మేం చెప్పలేదు..
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చేతులెత్తేయాలని తాము చెప్పలేదని.. పల్లె, నగర పోరులో ఫలితాలు చూసి టీడీపీకి భయం పట్టుకుందన్నారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో డా.గురుమూర్తికి అనూహ్య మెజారిటీ వస్తుందని.. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయం
మంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ, రాజకీయ విలువలు లేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. దళితులను అవమానించిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు. త్వరలో టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమని నారాయణ స్వామి అన్నారు.

వాళ్లే టీడీపీకి దిక్కుగా నిలిచారు..
టీడీపీకి రాష్ట్ర ప్రజలు సమాధి కట్టేశారని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి విమర్శించారు. టీడీపీ పాడె మోసేందుకు నలుగురు వ్యక్తులే మిగిలారన్నారు. నాలుగైదు సార్లు జనం ఓడించిన వాళ్లే టీడీపీకి దిక్కుగా నిలిచారని ఎమ్మెల్యే కాకాణి ఎద్దేవా చేశారు. 

పెళ్లాలను మార్చినట్టే పార్టీలను మారుస్తున్నాడు..
నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేసే చిత్తశుద్ధి సీఎం జగన్‌దని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవాడి గుండె ఆపరేషన్‌ని కూడా రాజకీయం చేసే వక్రబుద్ధి చంద్రబాబుదన్నారు, పవన్ పెళ్లాలను మార్చినట్టే పార్టీలను మారుస్తున్నాడని మంత్రి బాలినేని దుయ్యబట్టారు.

వారే ట్రెండ్ సెట్టర్స్..
ప్రజాసమస్యలు తెలిసిన అభ్యర్థినే సీఎం జగన్ బరిలోకి దించారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌, ఎన్టీఆర్‌, వైఎస్ జగన్‌ ట్రెండ్ సెట్టర్స్‌ అని, ఈ ముగ్గురిని మించిన నేతలు ఎవరూ లేరన్నారు. ఒక పార్టీలో పప్పు, మరో పార్టీలో కామెడి యాక్టర్‌ ఉన్నారంతేనంటూ రవీంద్రనాథ్‌రెడ్డి చలోక్తులు విసిరారు.

నవరత్నాలతో నవశకానికి నాంది
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలతో నవశకానికి నాంది పలికారని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్న సీఎం జగన్‌ వెంటే జనం ఉన్నారన్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో విశేష స్పందన కనిపిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు మించిన మెజారిటీ డా.గురుమూర్తికి రాబోతోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
చదవండి:
‘ఆ భయంతోనే టీడీపీ కుంటిసాకులు’
‘పవన్‌, లోకేష్‌.. ఇదో అజ్ఞానపు సంత’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement