విశాఖ: గంజాయి నిర్మూలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగావైఫల్యం చెందిందని వైఎస్సార్‌సీపీ(YSRCP) ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి(Varudu Kalyani) విమర్శించారు. ఇందుకు నిదర్శనమే విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి మొక్క కనిపించడమేనన్నారు. ఒక సెంట్రల్ జైలులో గంజాయి మొక్క కనిపించడం దారణమన్నారు వరుదు కళ్యాణి. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తానని హోంమంత్రి అనిత శపథం చేశారని, ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి సాగు అవుతుందని ధ్వజమెత్తారు.
సాక్షి టీవీతో ఆదివారం మాట్లాడిన వరుదు కళ్యాణి.. ‘ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి(Ganja) సాగవుతుంది. మీ వైఫల్యాలని కప్పి పుచ్చుకోవడం కోసం నెపం ప్రతిపక్షంపై నెట్టడం దుర్మార్గం. ఇది చేతకాని ప్రభుత్వం. విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. గంజాయి నిర్మూలనకు కాకుండా ప్రతిపక్షాలని టార్గెట్ చెయ్యడానికి మాత్రమే పోలీసులను వాడుతున్నారు. అందుకే దుర్మార్గులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్(Crime Rate) పెరిగింది. మహిళలపై దాడులు పెరిగాయి. రాష్ట్రంలోగంజాయిని అరికట్టాల్సిందే’ అని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.
రెండు రోజుల క్రితం విశాఖలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రాష్ట్రంలో స్కూల్ విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టడం దారుణం. ఎన్నికల ముందు ప్రతీ బిడ్డకు రూ.15000 చొప్పున ఇస్తామన్న మాటను కూటమి నిలబెట్టుకోవాలి. తల్లికి వందనం పేరుతో తల్లి, విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా చంద్రబాబు లక్షలాది మంది తల్లులకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం అమ్మఒడి పథకాన్ని వైఎస్ జగన్ తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నిర్వాకం వల్ల మళ్ళీ డ్రాప్ ఔట్స్ పెరిగే అవకాశం ఉంది. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నను తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు.
ఇది చదవండి: బాబూ.. ఛార్జీలు పెంచడం సంపద సృష్టా?: వరుదు కల్యాణి
Comments
Please login to add a commentAdd a comment