మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: నిత్యావసర ధరల నియంత్రణపై కేంద్రం చర్యలు ఆశాజనకంగా లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ధరలను నియంత్రించే చర్యలేమిటని, ప్రత్యామ్నాయ మార్గాలపై చేస్తున్న ఆలోచనలు ఏమిటని ప్రశ్నించింది. న్యూఢిల్లీలోని ఏపీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, గొడ్డేటి మాధవి, బీశెట్టి సత్యవతి, గురుమూర్తి మాట్లాడారు. ద్రవ్యోల్బణం, ధరల నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ధరల పెరగుదలకు కారణాలు చెప్పిన కేంద్రం ఉపశమన చర్యలు మాత్రం ప్రకటించలేదని విమర్శించారు.
ఎంపీ భరత్ మాట్లాడుతూ కరోనా కారణంగా ఆర్థికవ్యవస్థ ఒడుదొడుకులకు లోనైంది నిజమైనా.. పేదవాడి ఇబ్బందులు తీర్చడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. పెట్రో ఉత్పత్తులు, వంటనూనెల ధరల నియంత్రణలో వైఫల్యంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. కరోనా కారణంగా రెండేళ్లలో భారీగా ఆదాయం కోల్పోయిన పరిస్థితుల్లో కేంద్రం విప్లవాత్మకమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీడీపీ 8.9 శాతం నుంచి 7 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించాలని సూచించారు.
ముఖ్యంగా సోలార్, పునరుత్పాదక ఇంధన వనరులు, హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుదుత్పత్తులకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఇస్తే ప్రాజెక్టును పూర్తిచేసి 960 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి భారీగా పామాయిల్ వంటి సరుకులను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో భారత్‌లోనే వాటి ఉత్పాదకత పెరిగేలా రైతులకు పంట ప్రోత్సాహకాలు ప్రకటించాలని, ఎంఎస్‌పీని సవరించాలని కోరారు. టీటీడీపై జీఎస్టీని తొలగించాలన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ.18 వేల కోట్ల రెవెన్యూ లోటును కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఉపశమన చర్యలేవి?
ఎంపీ వంగా గీత మాట్లాడుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో దేశవ్యాప్తంగా ధరల పెరుగుదలకు కేంద్ర ఆర్థికమంత్రి కారణాలు చెప్పారే తప్ప పరిష్కార మార్గాలు చెప్పలేదని విమర్శించారు. పీఎం ఉజ్వల యోజన కింద 2లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి సిలిండర్ ధరను రూ.500 నుంచి రూ.వెయ్యికి పెంచితే లాభమేమిటని ప్రశ్నించారు. ఒకపక్క ధరల పెరుగుదలతో సతమతమవుతుంటే సహకార మార్కెట్‌లలో అమ్మే స్థానిక ఉత్పత్తులపైనా జీఎస్టీ విధించడం ఏమిటని నిలదీశారు. పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సరిపోవన్నారు. కేంద్రం మానవతా దృక్పథంతో పేదలపై భారం తగ్గించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment