సాక్షి, గుంటూరు: ఏపీలో పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి విడదల రజని(Vidadala Rajini). ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు.
మాజీ మంత్రి విడదల రజిని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ(aarogyasri) పేదలకు సంజీవిని లాంటింది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రారంభించారు. ఇతర సంక్షేమ పథకాల మాదిరిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చూడకూడదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పథకాన్ని వైఎస్ జగన్ మరింత బలోపేతం చేసి పేదలకు అందించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే అని భావించి ఆరోగ్యశ్రీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసింది.
ఈరోజు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు వైద్య సేవలు ఆపేశాయి. ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యత కాదు అని కూటమి సర్కార్ ఆలోచిస్తోంది. ఇటువంటి పరిస్థితులు మా ప్రభుత్వంలో ఎప్పుడూ రాలేదు. కోవిడ్(covid)ను ఆరోగ్యశ్రీలో చేర్చి మా ప్రభుత్వం వైద్యం అందించింది. గత ప్రభుత్వాలు అమలు చేసిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. మూడు వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఆరోగ్య శ్రీని హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్‌లో అమలు చేస్తామని చెబుతున్నారు. థర్డ్ పార్టీకి బీమా సౌకర్యం అందించే ప్రయత్నం మంచిది కాదు. బీమా కంపెనీలు సేవా దృక్పథంతో వ్యవహరించవు. అలాగే, బీమా సౌకర్యం ఎన్ని ఆసుపత్రుల్లో అమలు చేస్తారో తెలియదు. ఎన్ని రోగాలకు అమలు చేస్తారో తెలియదు. ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్ విధానాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తుంది. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదన్న సందేశాన్ని ఇస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేయలేకపోయాయి. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 637 కోట్ల పాత ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించారు అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment