టీడీపీకి తడబాటే.. పచ్చ నేతల్లో కొత్త టెన్షన్‌! | YSRCP Will Clean Sweep In Uttarandhra Seats | Sakshi
Sakshi News home page

టీడీపీకి తడబాటే.. పచ్చ నేతల్లో కొత్త టెన్షన్‌!

Published Sat, May 25 2024 2:19 PM | Last Updated on Sat, May 25 2024 5:02 PM

YSRCP Will Clean Sweep In Uttarandhra Seats

ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఓటింగ్ జరిగిన తీరు, పెరిగిన ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పైకి భీకరంగా ఉన్నా.. ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడాన్ని చూసి టీడీపీకి గుండె జారిపోయింది. దీంతో వారి కంటి మీద కునుకు కరువైంది. ఇంతకీ ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది?

సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల నుంచి ఊహించని విధంగా ఓటింగ్ జరగడం వైఎస్సార్సీపీకే అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో అనేక భారీ పరిశ్రమలు రావడంతో యువత వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపిందనే చర్చ జరుగుతోంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మూలపేట పోర్ట్, ఐటీ రంగం అభివృద్ధితోపాటు, భారీ పరిశ్రమలు ఏర్పాటు, విశాఖ నగర అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం వంటివి ఓటర్లను వైఎస్సార్సీపీ వైపు మరింతగా ఆకర్షితులను చేశాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనం పోతుందనే అభిప్రాయానికి అక్కడ ప్రజలు వచ్చారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమ్మఒడి, వైయస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు మహిళలకు ఎంతో అండగా నిలిచాయి. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ రావాలనే ఆలోచన మహిళల్లో స్పష్టంగా కనిపించింది.

పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు తెరవకముందు నుంచే మహిళలు వృద్ధులు బారులు తీరారు. గంటల కొద్దీ ఓపికగా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఆరు జిల్లాలు విశాఖ సిటీ, ఏజెన్సీ, మైదాన ప్రాంతాలు అనే తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. విజయనగరం జిల్లాలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ 81 శాతానికి పైగా జరగడం విశేషంగా చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలో పెరిగిన ఓటింగ్ టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హేమా హేమీలైన నేతల్లో వణుకు పుడుతోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని నిలబెట్టడం వైఎస్సార్‌సీపీకి కలిసి వచ్చింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు, ఆమె పుట్టినఊరు కావడంతో కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల ఓటర్లు సైతం బొత్స ఝాన్సీకి బ్రహ్మరథం పట్టారు.

టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం భరత్ ఎన్ని కోట్లు కుమ్మరించినా ప్రజలు బొత్స ఝాన్సీవైపే మొగ్గు చూపారు. గీతం భరత్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడడం, గీతం యూనివర్సిటీ ముసుగులో సాగించిన భూకబ్జాలను విశాఖ ప్రజలు మర్చిపోలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇదేవిధంగా తయారైంది. ప్రతీ ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటాకు ఈసారి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు.

ప్రతీ ఎన్నికలోనూ రిగ్గింగ్‌తో గెలిచే అచ్చెన్నాయుడుకు ఈసారి టెక్కలిలో చెక్ పడనుంది. అచ్చెన్న గూండాయిజం, అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఆయన్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది అదే పరిస్థితి. బూతులతో విరుచుకుపడే అయ్యన్నకు మహిళలు బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు, కొత్త రోడ్లు నిర్మాణం, రోడ్లు విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి వైఎస్సార్‌సీపీకి ప్రజలు మొగ్గు చూపించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకటరావులు పక్క నియోజకవర్గాలకు తరలి వెళ్లారు.

అనకాపల్లి ఎంపీగా ఒకప్పటి నాటు సారా వ్యాపారి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కూటమి తరపున పోటీ చేశారు. సీఎం రమేష్ నాన్ లోకల్ కావడం, ఓసీ వెలమ కావడంతో స్థానికంగా ఉన్న బీసీ వెలమలు వైఎస్సార్సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకే మోగ్గు చూపించారు. ఇక్కడున్న కొద్ది రోజుల్లోనే సీఎం రమేష్ రౌడీయిజంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సీఎం రమేష్ ఎన్నికలపుడే ఇంతటి గుండాయిజం చేస్తున్నాడు. పొరపాటున గెలిస్తే తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతాడనే ఆందోళన అనకాపల్లి ప్రజల్లో కనిపించింది. దీంతో రమేష్‌కు మద్దతివ్వడానికి అనకాపల్లి ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు.  

ప్రస్తుత ఓటింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీకి క్లీన్ స్వీప్ ఖాయం అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమి తరపున పోటీ చేసిన హేమాహేమీలంతా మట్టి కరుస్తారనే టాక్ నడుస్తోంది. టీడీపీకి గతంలో వచ్చిన కొద్ది సీట్లు కూడా ఈసారి రావనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement