శంషాబాద్ రూరల్: ‘కేసీఆర్ సర్కారు పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి.. ఇందుకోసం మనమంతా చేయి చేయి కలపాలి’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు ఓటేసి తెలంగాణ ప్రజలు మోసపోయారని, మరోసారి అలా కాకుండా తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ‘ప్రజా ప్రస్థానం’మహా పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండలో శనివారం స్థానికులతో మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ పరిపాలన చేస్తున్నారా.. గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో నిద్రపోతున్న కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. వైఎస్సార్ హయంలో రెండేళ్లకోసారి నోటిఫికేషన్ ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తు చేశారు. జంబో డీఎస్సీ ద్వారా 58 వేల టీచరు ఉద్యోగాలను ఒకే సారి భర్తీ చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందన్నారు.
రైతులకు ఒకేసారి రూ.లక్ష వరకు రుణ మాఫీ చేసిన వైఎస్సార్, ప్రజలపై ఎలాంటి పన్నుల భారం లేకుండా పాలన సాగించారని పేర్కొన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన సాధ్యమవుతుందని అన్నారు.
కేజీ టు పీజీ చదువులెక్కడ..
‘కేజీ టు పీజీ వరకు ఉచితంగా చదివిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.. కాని తెలంగాణలో పిల్లల చదువుల కోసం తల్లులు తాళీబొట్టు అమ్ముకుంటూ ఫీజులు కడుతున్న పరిస్థితులు ఉన్నాయి’అని షర్మిల ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఏమైందని నిలదీశారు. ఉద్యోగం ఇవ్వకుంటే రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వకుండా మోసం చేశారని దుయ్యబట్టారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన వాటా ఉందన్నారు.
ఏ ఒక్క విషయంలో తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఆదుకున్నారో చెప్పాలన్నారు. ఇందుకోసమేనా కేసీఆర్‌ను సీఎం చేసింది అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు రుణ మాఫీ, పావలావడ్డీ రుణాలు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్.. ఇలా ప్రతి వర్గానికి మేలు చేసి ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఎలాంటి చార్జీలు పెంచకుండానే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు.
‘మళ్లీ అదే వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడానికి నేను వచ్చాను’అని స్పష్టం చేశారు. తొండుపల్లి శివారు నుంచి శనివారం ప్రారంభమైన షర్మిల పాదయాత్ర గొల్లపల్లి, రషీద్‌గూడ, హమీదుల్లానగర్, చిన్నగోల్కొండ, పెద్దగోల్కొండ మీదుగా రాత్రికి మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చేరుకుంది. ఆయా గ్రామాల్లో వృద్ధులు, మహిళలు వారి సమస్యలను షర్మిలకు విన్నవించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment