‘అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన చంద్రబాబు.. అది ఈ శతాబ్ది అబద్ధం’ | YSRTUC KV Ramana Comment On Chandrababu Naidu Spreading Lies | Sakshi
Sakshi News home page

‘అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన చంద్రబాబు.. అది ఈ శతాబ్ది అబద్ధం’

Published Fri, Nov 1 2024 7:00 AM | Last Updated on Fri, Nov 1 2024 7:16 AM

YSRTUC KV Ramana Comment On Chandrababu Naidu Spreading Lies

చంద్రబాబు నాయుడు ఇటీవల టీడీపీ సభ్యత్వం తీసుకుంటూ ‘అందరి మూలాలూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయ’ని చెప్పడం ఈ శతాబ్ది అబద్ధం. ‘అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన ఇతనికి అబద్ధం చెప్పకపోతే తల వేయి ముక్క లవుతుందని ముని శాపం’ ఉందని గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చెప్పేవారు. అది నిజమేనని బాబు ప్రతి రోజూ రుజువు చేసుకుంటూనే ఉన్నారు. ఈయన మూలాలే కాంగ్రెస్‌వి అయితే, అందరి మూలాలూ తెలుగుదేశానివి ఎలా అయ్యాయి?

ప్రజా ప్రయోజనాలు, వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి... ఈయనా, ఈయన వందిమాగధులూ తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాదును తానే నిర్మించానని గొప్పలు చెప్పుకొంటూ ఉంటారు బాబు. అటువంటప్పుడు ఆయన పార్టీ తెలంగాణలో ఎందుకు నామరూపాలు లేకుండా పోయింది? రెండు తెలుగు రాష్ట్రా లలోనే లేని తెలుగుదేశం పార్టీని... జాతీయపార్టీ అని ఎలా అనగలుగుతున్నారో అర్థం కాదు.

కార్యకర్తల కోసమే పుట్టిన పార్టీగా టీడీపీ అధినాథుడు తన పార్టీ గురించి చెప్పుకొంటారు. మరి 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కడికి పోయారు? పోటీ చేయడానికి కూడా ఎందుకు సాహసించలేక పారిపోయారు? లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకోవడమే బాబు గొప్పతనం. అధికారాన్ని కట్ట బెట్టిన ఇటీవలి ఎన్నికల్లో పాత్ర పోషించింది కార్యకర్తలా, ఈవీఎంలా అనేది ప్రపంచానికి తెలిసిపోయింది. ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానాలి. కాంగ్రెస్‌ నుంచి వచ్చి, ఎన్టీ రామారావు నుంచి టీడీపీని లాగేసుకుని, ఎన్టీఆర్‌ మూలాలను పార్టీలో లేకుండా చేసిన ఘనుడు చంద్రబాబని ఎవరికి తెలియదు? సమస్యలను పక్కదారి పట్టించే నేర్పరితనాన్ని పక్కన పెట్టి, ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. వైఎస్సార్‌ సీపీ పాలనకు అలవాటుపడ్డ జనం టీడీపీ పాలన పట్ల ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్నారు. లేనిపోని అబద్ధపు ప్రచారం మాని ప్రజలను పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో  ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
– కె.వి. రమణ ‘ వైఎస్‌ఆర్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement