
తిరుపతి తుడా (చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓటర్లు సంక్షేమ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి అపూర్వ విజయాన్ని అందించారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో ఆదివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 95 శాతం ఎన్నికల హామీలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారన్నారు. సీఎంకు, అండగా నిలిచిన ప్రజలకు, వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం పనిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
75 శాతం పోలింగ్ నమోదవుతుందని భావించామని, అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. పోలింగ్ శాతం పెరిగి ఉంటే అనుకున్న మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చేవన్నారు. అయినా గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. గత ఎన్నికల్లో తిరుపతిలో తమ పార్టీ 55.03 శాతం, టీడీపీ 37.67 శాతం ఓట్లు సాధించగా.. ఈసారి వైఎస్సార్‌సీపీ 56.5 శాతం, టీడీపీ 32.01 శాతం ఓట్లు సాధించాయన్నారు. 5.66 శాతం ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఆడిన డ్రామాలను ప్రజలు నమ్మలేదని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment